‘కళ్యాణదుర్గంలో రౌడీ రాజ్యం’
అనంతపురం అర్బన్: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రౌడీ రాజ్యం సాగుతోందని సీఐటీయూ జిలా ్ల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఆర్‌వీనాయుడు, నాగేంద్రకుమార్ విమర్శించారు. ఎమ్మెల్యే పేరుతో రాజ్యాంగం, కార్మిక చట్టాలు, ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ధ్వజమెత్తారు. ఆదివారం స్థానిక ఆ సంఘం జిల్లా కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడారు. శ్రీరామరెడ్డి తాగునీటి పథకంలో పని చేస్తున్న 670 మంది కార్మికులకు నెలలుగా వేతనాలు చెల్లించకుండా వేధింపులకు గురి చేస్తున్నారని, దీనిపై ప్రశ్నిస్తే దౌర్జన్యాలు, బెదిరింపులు, పోలీసు ఒత్తిళ్లతో కార్మికులను అణిచివేసే చర్యలు ఊపందుకున్నాయని మండిపడ్డారు. దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కళ్యాణదుర్గంలో రెండు నెలలుగా కార్మికులు రిలేదీక్షలు నిర్వహిస్తున్నా నేటికీ ఎమ్మెల్యే స్పందించ లేదంటే ఇది ఆయన అహంకారానికి, నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా అక్రమాలు, దౌర్జన్యాలను కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం చూపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇది చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు.


