కళ్లులేని ప్రభుత్వం.. కనికరం లేని సీఎం | - | Sakshi
Sakshi News home page

కళ్లులేని ప్రభుత్వం.. కనికరం లేని సీఎం

Aug 26 2025 7:40 AM | Updated on Aug 26 2025 7:40 AM

కళ్లు

కళ్లులేని ప్రభుత్వం.. కనికరం లేని సీఎం

పింఛన్ల తొలగింపుపై

భగ్గుమన్న దివ్యాంగులు

ధర్నాలతో అట్టుడికిన కలెక్టరేట్‌

అనంతపురం అర్బన్‌: పింఛన్ల తొలగింపుపై దివ్యాంగులు భగ్గుమన్నారు. కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. అర్హులైన దివ్యాంగులకు పింఛను తొలగించిన కళ్లులేని ప్రభుత్వం... కనికరం లేని ముఖ్యమంత్రికి తమ ఉసురు తగిలి తీరుతుందంటూ శాపనార్థాలు పెట్టారు. రీ వెరిఫికేషన్‌ పేరిట తొలగించిన పింఛన్లు తక్షణం పునరుద్ధరించాలంటూ దివ్యాంగుల సంఘాలు వేర్వేరుగా సోమవారం చేపట్టిన నిరసనలు, ధర్నాలతో కలెక్టరేట్‌ అట్టుడికిపోయింది. వైఎస్సార్‌సీపీ దివ్యాంగుల విభాగం నాయకులు, దివ్యాంగులు కలెక్టరేట్‌ ఆవరణలో నిరసన తెలిపారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నాయకులు, దివ్యాంగులు కలెక్టరేట్‌ ఎదురుగా రోడ్డుకు ఒకవైపున.. భారతీయ భీమ్‌ సేన ఆధ్వర్యంలో నాయకులు, దివ్యాంగులు కలెక్టరేట్‌ ఎదురుగా రోడ్డుకు మరోవైపు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో రోడ్డుకు రెండు వైపులా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో డీఆర్‌ఓ మలోల అక్కడికి చేరుకుని నాయకులతో మాట్లాడారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులందరికీ పింఛను అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో నాయకులు ఆందోళన కార్యక్రమాన్ని విరమించారు.

● వైఎస్సార్‌సీపీ దివ్యాంగుల విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఆవరణలో నాయకులు, దివ్యాంగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఉపేంద్రగౌడ్‌ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా తొలగించిన దివ్యాంగ పింఛన్లు పునరుద్ధరించాలన్నారు. వెరిఫికేషన్‌ పేరిట దివ్యాంగులను ఇబ్బంది పెడితే సహించబోమన్నారు. దివ్యాంగుల ఆర్థిక, సామాజిక, మానసిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలన్నారు.కార్యక్రమంలో నియోజకవర్గాల అధ్యక్షులు పాతలింగ, వడ్డే ఆంజనేయులు, అంజనయ్య, ఫకృద్ధీన్‌, ఎస్‌కే కాలేషా, తదితరులు పాల్గొన్నారు.

● వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్‌పీఎస్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకోలో సమితి జిల్లా అధ్యక్షుడు జానకిరామయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దన్న, ఎమ్మార్పీఎస్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కేపీ మధు మాట్లాడుతూ తొలగించిన దివ్యాంగుల పింఛన్లు పునరుద్ధరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సమితి మహిళా అధ్యక్షురాలు జయమ్మ, నాయకులు తిప్పేస్వామి, రంగనాథ్‌, శ్రీనివాసులు, రామాంజినేయులు, రఘునాథ్‌, తిప్పేస్వామి, స్వతంత్రకుమారి, పార్వతి తదితరులు పాల్గొన్నారు.

● దివ్యాంగుల పింఛన్లు తొలగించడం దుర్మార్గ మంటూ భారతీయ భీమ్‌ సేన ఆధ్వర్యంలో నాయకులు, దివ్యాంగులు కలెక్టరేట్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ భీమ్‌ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఓబులేసు, వ్యవస్థాపకుడు రామాంజినేయులు మాట్లాడుతూ అర్హులైన దివ్యాంగులు వేలల్లో ఉన్నారని, వారి పింఛన్లు పునరుద్ధరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు కుల్లాయప్ప, ఓబుళపతి, పుల్లన్న, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ దివ్యాంగుల విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఆవరణలో

నిరసన తెలుపుతున్న నాయకులు, దివ్యాంగులు

దివ్యాంగులతో కలిసి కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించిన

ఎమ్మార్పీఎస్‌, ఎమ్మెస్పీ, వీహెచ్‌పీఎస్‌ నాయకులు

కళ్లులేని ప్రభుత్వం.. కనికరం లేని సీఎం 1
1/1

కళ్లులేని ప్రభుత్వం.. కనికరం లేని సీఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement