
తన్నుకున్న ‘తమ్ముళ్లు’
ఉరవకొండ/ఉరవకొండ రూరల్: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో ‘తెలుగు తమ్ముళ్లు’ రచ్చకెక్కారు. ఒకరిని ఒకరు తన్నుకున్నారు. సోమవారం ఉరవ కొండ మండలం ఆమిద్యాల గ్రామంలో టీడీపీకి చెందిన మాజీ ఎంపీపీ సుంకరత్నమ్మ, అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఆనంద్ వర్గాలు ఘర్షణకు దిగాయి. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ టీడీపీ నాయకుడు సూర్యనారాయణ తెలిపిన మేరకు.. ఆమిద్యాల ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ఏజెన్సీని మాజీ ఎంపీపీ సుంకరత్నమ్మ నిర్వహిస్తోంది. భోజన సరఫరాలో లోటుపాట్లు ఉన్నాయని ఇటీవల ఆనంద్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై సోమవారం పాఠశాల హెచ్‌ఎం రామాంజనేయులతో చర్చిస్తున్న సమయంలో మాజీ ఎంపీపీ వర్గీయులు అక్కడకు చేరుకుని వాగ్వాదానికి దిగారు. అంతలోనే మాజీ ఎంపీపీ సోదరుడు సూర్యనారాయణ అక్కడ చేరుకోగా ఆగ్రహించిన ఆనంద్ వర్గీయులు బడిలో గంట కొట్టే ఇనుపరాడ్‌తో ఆయన తలపై బలంగా కొట్టారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
జిల్లాకు 1,022 మెట్రిక్ టన్నుల ఎరువులు
అనంతపురం అగ్రికల్చర్: యూరియా రాకకోసం వ్యవసాయశాఖ, మార్క్‌ఫెడ్ ఎదురుచూస్తోంది. రైతులు రోడ్డెక్కుతున్న నేపథ్యంలో సోమవారం స్పిక్ కంపెనీ నుంచి వస్తుందని భావించినా... యూరియా స్థానంలో డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు వచ్చాయి. రెండు మూడు రోజుల్లో యూరియా సరఫరా అవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతానికి జిల్లాలో ఎక్కడా యూరియా రైతులకు లభించే పరిస్థితి లేదు. ఆర్‌ఎస్‌కేలు, సొసైటీలు, డీసీఎంఎస్ గోదాములు ఖాళీ కాగా ప్రైవేట్ హోల్‌సేల్, రీటైర్ల దగ్గర ఖాళీ అయినట్లు చెబుతున్నారు. 1,016 మెట్రిక్ టన్నులు బఫర్‌స్టాకు ఉండగా.. డిమాండ్ ఉన్న రాప్తాడు, బొమ్మనహాళ్, ఉరవకొండ మండలాల్లోని కొన్ని ఆర్‌ఎస్‌కేలకు అందులో 300 మెట్రిక్ టన్నులకు పైగా సరఫరా చేశారు. ప్రస్తుతం 700 మెట్రిక్ టన్నులు బఫర్‌స్టాక్ ఉన్నట్లు మార్క్‌ఫెడ్ అధికారులు తెలిపారు. రెండు మూడు రోజుల్లో యూరియా వచ్చే అవకాశం ఉందన్నారు. సోమవారం ఇఫ్కో కంపెనీ నుంచి 1,022 మెట్రిక్ టన్నులు జిల్లాకు చేరినట్లు రేక్ ఆఫీసర్, ఏడీఏ అల్తాఫ్‌అలీఖాన్ తెలిపారు. 815 మెట్రిక్ టన్నులు డీఏపీ రాగా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు అందులో 500 మెట్రిక్ టన్నులు మార్క్‌ఫెడ్‌కు, మిగతా 315 మెట్రిక్ టన్నులు ప్రైవేట్ హోల్‌సేల్ డీలర్లకు కేటాయించినట్లు పేర్కొన్నారు. అలాగే 20–20–0–13 రకం కాంప్లెక్స్ ఎరువులు 207 మెట్రిక్ టన్నులను ఇండెంట్ మేరకు ప్రైవేట్ హోల్‌సేల్ డీలర్లకు సరఫరా చేయనున్నట్లు తెలిపారు.