
దారి కాచిన మృత్యువు
వజ్రకరూరు: 15 రోజుల క్రితం జన్మించిన తన కూతురును చూడాలని ఆ తండ్రి అనుకున్నాడు. వెంటనే మిత్రులతో కలిసి ద్విచక్ర వాహనంలో అత్తారింటికి వెళ్లాడు. కూతురును చూసిన అనంతరం సంతోషంగా స్వగ్రామానికి తిరుగుపయనమయ్యాడు. మార్గమధ్యంలో ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఇదే ప్రమాదంలో అతనితో పాటు మరొక వ్యక్తి చనిపోగా.. మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన వజ్రకరూరు మండల పరిధిలో జరిగింది. వజ్రకరూరు ఎస్‌ఐ నాగస్వామి తెలిపిన వివరాల మేరకు... పామిడి పట్టణానికి చెందిన షేక్ బాబాఫకృద్దీన్‌కు ఉరవకొండకు చెందిన ఫర్హానాబేగంతో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 15 రోజుల క్రితం కుమార్తె జన్మించింది. ఆదివారం సాయంత్రం కుమార్తెను చూడటానికి బాబాఫకృద్దీన్ (32) తన మిత్రులు నజీర్‌బాషా (20), ఫారూక్ అలియాస్ మహమ్మద్ రఫీలతో కలిసి ద్విచక్రవాహనంలో పామిడి నుంచి ఉరవ కొండలోని అత్తారింటికి వెళ్లారు. రాత్రి ఉరవకొండ నుంచి తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యంలోని వజ్రకరూరు సమీపంలోని మలుపు వద్ద ద్విచక్రవాహనం అదుపు తప్పి కిందకు పడింది. నజీర్‌బాషా అక్కడికక్కడే మృతిచెందాడు. బాబా ఫకృద్దీన్, ఫారూక్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని అంబులెన్స్‌లో ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం బాబాఫకృద్దీన్ మరణించాడు. ఫారూక్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్పించారు. మృతుడు నజీర్‌బాషా తండ్రి హాజీవలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
షేక్ బాబాఫకృద్దీన్ (ఫైల్)
నజీర్‌బాషా(ఫైల్)
ఆనందం.. అంతలోనే విషాదం
కుమార్తెను చూసి వస్తూ తిరిగిరాని లోకాలకు తండ్రి
ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్దరు వ్యక్తుల దుర్మరణం
మరొకరి పరిస్థితి విషమం

దారి కాచిన మృత్యువు