
సికింద్రాబాద్–తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: దసరా, దీపావళి పండుగలకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్–తిరుపతి మధ్య వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శ్రీధర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ జంక్షన్ (07009) నుంచి సెప్టెంబర్ 4– సెప్టెంబర్ 25వ తేదీ వరకు ప్రతి గురువారం (4 సర్వీసులు) రైలు తిరుగుతుందన్నారు. తిరుపతి జంక్షన్ (07010) నుంచి సెప్టెంబర్ 5–సెప్టెంబర్ 26 వరకు ప్రతి శుక్రవారం నడుపుతున్నట్లు పేర్కొన్నారు. కాచిగూడ, ఉందా నగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్డు, గద్వాల్, కర్నూలు, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట మీదుగా రాకపోకలు సాగిస్తాయి. రైళ్లలో ఫస్ట్ క్లాస్ కమ్ సెకండ్ ఏసీతోపాటు 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.