
రక్తదానంతో రోగికి ప్రాణదానం
గుంతకల్లు: అరుదైన ‘ఓ’ నెగిటివ్ రక్త దానంతో క్యాన్సర్ రోగికి ప్రాణదానం చేశాడు గుంతకల్లుకు చెందిన పరుశురాముడు. వివరాలు.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కేవీ లక్ష్మి హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అరుదైన ‘ఓ’ నెగిటివ్ (బాంబే బ్లడ్) గ్రూప్ ఉన్న ఆమెకు శస్త్రచికిత్స చేయాల్సి ఉండడంతో రక్తం అవసరమై కుటుంబసభ్యులు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, మహారాష్ట్రల్లోని పలువురు రక్తదాతలను సంప్రదించారు. విషయం గుంతకల్లులోని ప్రాణదాత సేవా సమితి సభ్యులకు తెలియడంతో ఓ నెగిటివ్ బ్లడ్ కలిగిన పరుశురాముడుకు సమస్య వివరించారు. దీంతో ఆయన ఆదివారం స్థానిక గోపీ బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేయడంతో లక్ష్మి కుటుంబసభ్యుడు సురేష్ జాగ్రత్తగా తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా పరుశురాముడుని పలువురు అభినందించారు. కార్యక్రమంలో ప్రాణదాత సేవా సమితి సభ్యులు తిమ్మప్ప, హనుమంతు, హస్సేన్, బర్మాశాల రఘు, గఫూర్, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, పరుశురాముడు మాట్లాడుతూ.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కేవలం 18 మంది మాత్రమే ‘ఓ’ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కలిగిన వారున్నారన్నారు. ఇందులో తరచూ ఆరుగురు మాత్రమే రక్త దానానికి ముందుకు వస్తున్నారని, ఇప్పటి వరకూ తాను 35 సార్లు రక్తదానం చేసినట్లు వివరించారు.