
సంపద లేని కేంద్రాలు
గ్రామాల పరిశుభ్రతతో పాటు ప్రజలు కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి చెత్త సంపద కేంద్రాలను నిర్మించింది. చెత్తను వేరు చేసి ఎరువులుగా తయారు చేసి వాటి ద్వారా వచ్చే ఆదాయంతో పంచాయతీలను అభివృద్ధి చేయాల్సి ఉంది. అయితే మహోన్నత ఆశయం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నీరుగారిపోతోంది.
కళ్యాణదుర్గం: ప్రభుత్వం ప్రతి నెలా మూడో శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఆ ఒక్కరోజు మాత్రమే తూతూ మంత్రంగా కార్యక్రమాన్ని చేపట్టి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. గ్రామాల్లో చెత్త సేకరణ కూడా సక్రమంగా జరగడం లేదు. దీంతో చెత్త సేకరణ కేంద్రాలు కూడా మరుగున పడ్డాయి.
కొరవడిన అధికారుల పర్యవేక్షణ
గ్రామాల్లో ఇంటింటా వ్యర్థాలు సేకరించేందుకు హరిత రాయబారులను నియమించి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. చెత్త సంపద కేంద్రాలపై జిల్లాస్థాయి అధికారులతో పాటు డివిజన్, మండలస్థాయి అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో రూ.లక్షల వ్యయంతో నిర్మించిన సంపద కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. ప్రతి ఊరిలో ఎక్కడ పడితే అక్కడ రహదారుల పక్కన చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. చెత్తను ఎక్కడికీ తరలించకుండా చెత్తకు నిప్పు పెట్టి చేతులు దులిపేసుకుంటున్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా..
జిల్లా వ్యాప్తంగా లక్షలాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు నిరుపయోగంగా మారడంతో గ్రామాల్లో మందుబాబులకు ఆవాసాలుగా మారాయి. గ్రామాలకు దూరంగా ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. కొన్నిచోట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఒక్కో కేంద్రానికి సుమారు రూ.3.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ వెచ్చించి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి వాటి నిర్వహణపై చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయా గ్రామాల సర్పంచులు కోరుతున్నారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను పర్యవేక్షించాలని, చెత్త నుంచి ఆదాయం పెంచుకొని ఆ మొత్తాన్ని గ్రామ పంచాయతీల అభివృద్ధికి వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
గతంలో పక్కాగా..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చెత్త సంపద తయారీ కేంద్రాలకు చేరిన వ్యర్థాలను తడి, పొడిగా వేరుచేసి వర్మీకంపోస్టు ఎరువు తయారు చేసేవారు. దీన్ని కిలో రూ.30 నుంచి రూ.40 వరకు రైతులకు విక్రయించి పంచాయతీలకు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకునేవారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక సంపద కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ కొరవడి లక్ష్యం నీరుగారిపోయింది. ఇప్పటికై నా రూ.లక్షల వ్యయంతో నిర్మించిన చెత్త సంపద కేంద్రాలను వినియోగంలోకి తీసుకొస్తే పంచాయితీలకు ఉపయోగకరంగా ఉంటుంది.
దిష్టి బొమ్మల్లా మారిన చెత్త సంపద తయారీ కేంద్రాలు
స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర ఉత్త్తిదే !
గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడే చెత్త దిబ్బలు
పంచాయితీల ఆదాయానికి గండి

సంపద లేని కేంద్రాలు

సంపద లేని కేంద్రాలు