
సురవరం మృతి బాధాకరం
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత
అనంతపురం కార్పొరేషన్: సీపీఐ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి మరణం బాధాకరమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1998, 2004లో సురవరం సుధాకర్‌రెడ్డి ఎంపీగా ఉన్నారని, అదే సమయంలో తాను కూడా అనంతపురం ఎంపీగా ఉన్నట్లు గుర్తు చేసుకున్నారు. సమాజం పట్ల నిబద్ధత, పేద ప్రజలకు మంచి చేయాలన్న తలంపు సురవరం సుధాకర్‌రెడ్డిలో ఉండేదన్నారు. ఆయన మరణం కమ్యూనిస్టు పార్టీలకే కాకుండా బడుగు, బలహీన వర్గాలకు తీరని లోటన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
సురవరం మృతి ప్రజాస్వామ్య ఉద్యమాలకు తీరని లోటు
● మాజీ ఎమ్మెల్యే విశ్వ
ఉరవకొండ: కమ్యూనిస్టు యోధుడు, సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి మృతి వామపక్ష , ప్రజాస్వామ్య ఉద్యమాలకు తీరని లోటని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాకెట్ల అశోక్ ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. దేశవ్యాప్త విద్యార్థి, యువజన, ఉద్యమాల వ్యాప్తికి సురవరం విశేష కృషి చేశారన్నారు. ఆయన నేతృత్వంలో పనిచేసిన అనేక మంది విద్యార్థి, యువజన నాయకులు తర్వాత కాలంలో వివిధ రాష్ట్రాల్లో రాజకీయ నేతలుగా ఎదిగారన్నారు. సురవరం ఆత్మకు శాంతి చేకురాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇళ్ల నిర్మాణాలపై
ప్రత్యేక దృష్టి పెట్టాలి
అనంతపురం: ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో శనివారం హౌసింగ్ అధికారులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వార్డు అమినిటీ సెక్రటరీలతో కలెక్టర్ సమీక్షించారు. లబ్ధిదారులకు ఇళ్ల బిల్లులు త్వరగా అందుతున్నాయా, లేదా? ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వార్డు అమినిటీ సెక్రటరీలు అందుబాటులో ఉన్నారా, లేదా అనే అంశంపై ఫోన్ కాల్స్ ద్వారా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటామన్నారు. లబ్ధిదారులతో అధికారుల ప్రవర్తన సక్రమంగా ఉండాలన్నారు. ఇళ్ల నిర్మాణాల్లో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ శైలజ, డీఈ విజయభాస్కర రావు పాల్గొన్నారు.
● జిల్లాలో ఉచిత ఇసుక విధానం సజావుగా అమలు చేయాలని కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. ఈ అంశంపై ఏజెన్సీలు, రవాణాదారులతో ఆయన సమీక్షించారు.

సురవరం మృతి బాధాకరం