
అనంత వాసులకు బళ్లారి రాఘవ పురస్కారాలు
అనంతపురం కల్చరల్: నగరానికి చెందిన సీనియర్ రంగస్థల కళాకారులు రామగోవింద సాగర్, సాధుశేఖర్ కళాప్రపూర్ణ బళ్లారి రాఘవ జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు. గత ఐదు దశాబ్దాలుగా కళాకారుల ప్రతిభను గుర్తిస్తూ వారికి గౌరవ సత్కారాలనందిస్తున్న బళ్లారి కల్చరల్ యాక్టివిటీస్ అసోసియేషన్ ప్రతినిధులు 53వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులను పురస్కారాలకు ఎంపిక చేశారు. వచ్చేనెల 6న బళ్లారిలో అవార్డుల ప్రదానం జరుగుతుందని నిర్వాహకులు డాక్టర్ బ్రహ్మయ్య తెలిపారు. జాతీయ అవార్డులను అందుకోనున్న రామగోవిందసాగర్, సాధుశేఖర్ రంగస్థలంతో పాటూ ఇంటాక్ (భారతీయ కళలు, వారసత్వ పరిరక్షణ సంస్థ) ద్వారా మన సంస్కృతిని చాటే సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి లలితకళాపరిషత్తు కార్యదర్శి గాజుల పద్మజ, ఇంటాక్ కన్వీనర్ రాంకుమార్, కార్యవర్గ సభ్యులు అభినందనలు తెలిపారు.
జేఎన్‌టీయూకు
ఐఎస్‌ఓ గుర్తింపు
అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురంకు ఐఎస్‌ఓ (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండరైజేషన్) గుర్తింపు దక్కింది. వర్సిటీలోని అన్ని విభాగాలు, క్యాంపస్ కళాశాల, ఓటీపీఆర్‌ఐలోని అన్ని విభాగాలను ఐఎస్‌ఓ బృందం పరిశీలించింది. ఆరు నాణ్యతా ప్రమాణాల సర్టిఫికెట్స్ (ఐఎస్‌ఓ) రావడం ఎంతో గర్వకారణమని వీసీ హెచ్. సుదర్శనరావు పేర్కొన్నారు. జేఎన్‌టీయూ అనంతపురంకు ఐఎస్‌ఓ గుర్తింపు రావడం సంతోషకరమన్నారు.
25న సర్టిఫికెట్ల పరిశీలన
అనంతపురం: కానిస్టేబుల్ (సివిల్, ఏపీఎస్పీ) ఉద్యోగానికి ఎంపికై న అభ్యర్థులు ఈ నెల 25న ఉదయం 8 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలని ఎస్పీ పి. జగదీష్ తెలిపారు. జిల్లాలో సివిల్ విభాగం 278 మంది, ఏపీఎస్పీ విభాగం 210 మంది కానిస్టేబుళ్ల ఉద్యోగాలు సాధించారు. అన్ని ధ్రువపత్రాలు, గెజిటెడ్ అధికారిచే అటెస్టెడ్ చేయించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలను, నాలుగు పాస్‌పోర్టు సైజ్ కలర్ ఫొటోలను వెంట తీసుకరావాలని సూచించారు.

అనంత వాసులకు బళ్లారి రాఘవ పురస్కారాలు