అనంతపురం: అనంతపురం ఉమ్మడి జిల్లా విజిలెన్స్ అండ్ ఎంఫోర్స్‌మెంట్ ఆఫీసర్ వైబీపీటీఏ ప్రసాద్ ఆదేశాల మేరకు అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఎరువుల గోడౌన్‌లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనంతపురం జిల్లాలో రాప్తాడు మండలం అయ్యవారిపల్లిలోని అవేజ్ లిమిటెడ్ గోడౌన్‌లో 874 మెట్రిక్ టన్నులు, శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించి 713 మెట్రిక్ టన్నుల నిల్వలను గుర్తించారు. అనంతపురంలోని శ్రీనివాస ఫర్టిలైజర్స్‌లో నిషేధిత గడ్డి మందు అయిన గ్లెఫోసెట్ మందు (రూ.17,560 విలువ.. 22 లీటర్లు) సీజ్ చేసి కోర్టులో కేసు నమోదుకు సిఫార్సు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురంలో శ్రీబాలాజీ ట్రేడర్స్‌లో యూరియా నిల్వ, విలువల్లో తేడాలు గుర్తించారు. బస్తాలను జప్తు చేసి చట్టపరమైన చర్యలకు వ్యవసాయాధికారికి అప్పగించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎం. నాగభూషణం, సీఐ కే. శ్రీనివాసులు, సీఐ జమాల్ బాష, డీసీటీఓ సురేష్ కుమార్, ఎస్‌ఐ నరేంద్ర భూపతి, విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.
రూ.46.8 లక్షల పురుగు మందులు సీజ్
అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్రంలో అమ్మకాలకు అనుమతి లేని క్రిమిసంహారక మందులను అధికారులు సీజ్ చేశారు. యూరియాతో పాటు ఇలాంటి పురుగు మందులు అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారం ఆధారంగా శనివారం సాయంత్రం ఏడీఏ అల్తాఫ్‌అలీఖాన్, ఏఓ వెంకటకుమార్‌లు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న సంజీవరాయ ఫర్టిలైజర్స్ దుకాణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 117 బాక్సుల్లో నిల్వ చేసిన రూ.46.8 లక్షలు విలువ చేసే వందలాది లీటర్ల సోలోమాన్ క్రిమిసంహారక మందులను గుర్తించారు. ఈ మందు అమ్మకాలకు రాష్ట్రంలో అనుమతులు లేవని ఏడీఏ తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన పంటల్లో రసం పీల్చు పురుగు నివారణకు వీటిని పిచికారి చేస్తారన్నారు. అనుమతి లేకుండా విక్రయాలు సాగిస్తున్నందున వాటిని సీజ్ చేశామన్నారు.
యాడికిలోనూ..
యాడికి: మండల కేంద్రంలోని ఎరువుల దుకాణంపై మండల వ్యవసాయ అధికారి మహబూబ్ బాషా, రెవెన్యూ అధికారులు శనివారం దాడి చేశారు. వెంకట్ ఫర్టిలైజర్ ఎరువుల దుకాణంలో అనుమతిలేని ఎరువులు, పురుగు మందులు గుర్తించారు. రూ.90 లక్షల విలువ గల 48 క్వింటాళ్ల పత్తి విత్తనాలు, రూ.40 లక్షల విలువ గల 550 లీటర్ల పురుగు మందులు సీజ్ చేసినట్లు ఏఓ తెలిపారు.