
దగ్గుపాటీ.. బహిరంగ క్షమాపణ చెప్పు
గుత్తి: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆయన అభిమానులు డిమాండ్ చేశారు. గుత్తిలో సోమవారం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కదం తొక్కారు. పట్టణంలోని రాయల్ సర్కిల్ వద్ద నిరసనకు దిగారు. ఎమ్మెల్యే దగ్గుపాటి చిత్రపటాలను చెప్పుకాళ్లతో తొక్కిన అనంతరం కాల్చివేశారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం పట్టణ అధ్యక్షుడు రాజు, మండల అధ్యక్షుడు సాదిక్, కార్యదర్శి నాగేంద్ర ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్‌ను వ్యక్తిగతంగా తిట్టడం దారుణమన్నారు. ఎన్నికల్లో టీడీపీ గెలవడానికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా కారణమన్నారు. ముఖ్యంగా ప్రసాద్ గెలవడానికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కీలకపాత్ర పోషించారన్నారు. తామే ఓటు వేయకుంటే ఎక్కడుండేవాడివంటూ ప్రశ్నించారు. జూనియర్ ఎన్టీఆర్‌కు దేశవ్యాప్తంగా అభిమానులున్నారని, వారు తలచుకుంటే అనంతపురంలో కూడా దగ్గుపాటి తిరగలేడని హెచ్చరించారు. వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పి తీరాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు రామ్మోహన్, అశోక్, మారేష్, నరేష్, మస్తాన్, అరవింద్, భాస్కర్, సీతయ్య తదితరులు పాల్గొన్నారు.
రాయదుర్గంలో..
రాయదుర్గంటౌన్: జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా వార్–2 విడుదల సందర్భంగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై రాయదుర్గంలో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక బళ్లారి రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. తిప్పేస్వామి, వెంకటేశులు, ఓబలేశు, మలకన్న, పొంపాపతి పాల్గొన్నారు.
గుత్తి, రాయదుర్గంలో కదం తొక్కిన
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు
ఎమ్మెల్యే చిత్రపటాలను చెప్పు కాళ్లతో తొక్కి నిరసన

దగ్గుపాటీ.. బహిరంగ క్షమాపణ చెప్పు