
మట్టి గణపతిని పూజించాలి
● కలెక్టర్ వినోద్‌కుమార్ పిలుపు
అనంతపురం అర్బన్: వినాయక చతుర్థి సందర్భంగా మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని పరిక్షించాలని ప్రజలకు కలెక్టర్ వి.వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘మట్టి ప్రతిమలను పూజించి– పర్యావరణాన్ని పరిరక్షించాలి’ అనే పోస్టర్లను కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి విశిష్టతను కాపాడేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. సహజ రంగులతో చేసిన మట్లి ప్రతిమలతో పర్యావరణ అనుకూల వినాయక చవితిని జరుపుకోవాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించకూడదన్నారు. జల వనరులకు నష్టం కలిగించే వ్యర్థ పదార్థాల వినియోగం తగ్గించడం లేదా పూర్తిగా మానేయాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్‌ఓ ఎ.మలోల, ఎఫ్‌ఎస్‌ఓ రామకృష్ణారెడ్డి, ఏపీపీసీబీ పర్యావరణ ఇంజినీరు పీవీ కిషోర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఎన్‌హెచ్ పనులు వేగవంతం చేయాలి
● జాతీయ రహదారి 544–డీ పనులు వేగ వంతం చేయాలని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రహదారి పనులపై సోమవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్షించారు. సోములదొడ్డి నుంచి ముచ్చుకోట వరకు 37 కిలోమీటర్లు, ముచ్చుకోట నుంచి బుగ్గ వరకు 32 కిలోమీటర్లు జాతీయ రహదారి 544–డీ చేపట్టామన్నారు. ఇందుకు సంబంధించి పెండింగ్ ఉన్న భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
‘అప్రమత్తంగా ఉండండి’
అనంతపురం అర్బన్: జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినోద్‌కుమార్ సూచించారు. విపత్తుల సంస్థ సూచనల మేరకు జిల్లాలో పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. చెట్లు, టవర్లు, విద్యుత్ స్తంభాల కింద, మైదానాల్లో ఉండకూడదన్నారు. సురక్షిత భవనాల్లో ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
‘ఆ జీఓ వెనుక కుట్ర’
అనంతపురం ఎడ్యుకేషన్: పాఠశాలల్లోకి బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధించే జీఓ వెనుక కుట్ర దాగి ఉందని వైఎస్సార్ విద్యార్థి విభాగం నేతలు ధ్వజమెత్తారు. జైల్లో ఖైదీలను కలిసే అవకాశం ఉంది కానీ పాఠశాలల్లో విద్యార్థులను కలిసే అవకాశం లేకుండా చేశారని మండిపడ్డారు. ఆ జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం ఎదుట మోకాళ్లపై నిల్చుని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం లేదని మంత్రి లోకేష్ రెడ్‌బుక్ పాలన అమలవుతోందని విమర్శించారు. విద్యార్థుల సమస్యలు వెలుగులోకి వస్తాయనే భయంతోనే పాఠశాలల్లోకి ఎవరూ వెళ్లకూడదనే జీఓ తెచ్చారని దుయ్యబట్టారు. ప్రభుత్వ విద్యను నీరుగార్చడమే మంత్రి లోకేష్ లక్ష్యంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాసంస్థలకు కూటమి ప్రభుత్వం కొమ్ము కాస్తోందన్నారు. నగర అధ్యక్షుడు కై లాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి నిశాంత్ రెడ్డి మాట్లాడుతూ రెడ్‌బుక్ పాలనపై పెట్టిన దృష్టి పిల్లల బుక్కులపై పెట్టలేదన్నారు. జీఓ రద్దు చేయకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, శింగనమల నియోజకవర్గ అధ్యక్షుడు రేవంత్, నగర నాయకులు రాహుల్ రెడ్డి, ఆదిల్, అశోక్, నరేంద్రరెడ్డి, సిద్దిక్, రోహిత్, జిలాన్, సతీష్, నాగేంద్ర, సాయి, రవి, పూజ విగ్నేష్, బాబా, ఇమ్రాన్, సురేంద్ర, చరణ్ పాల్గొన్నారు.

మట్టి గణపతిని పూజించాలి