
పేద బతుకులతో ఆటలా?
● వైకల్యమున్నా తక్కువగా చూపి
పింఛన్లు తొలగిస్తారా..
● దివ్యాంగుల ఆవేదన
● రెవెన్యూభవన్ వద్ద ధర్నా
అనంతపురం అర్బన్: రీ వెరిఫికేషన్ పేరిట వైకల్యం తక్కువగా చూపించి పేద బతుకులతో ఆటలాడడం న్యాయమా అంటూ దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. పింఛను పునరుద్ధరించాలంటూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్ వద్ద దివ్యాంగులు ధర్నా చేశారు. న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు వసంతకుమార్, కో–ఆర్డినేటర్ హరినాథరెడ్డి మాట్లాడుతూ.. పదేళ్లకు పైగా పింఛను తీసుకుంటున్న దివ్యాంగులనూ రీ–వెరిఫికేషన్ పేరుతో తొలగించారన్నారు. వైద్యులు ఉద్దేశపూర్వకంగా వైకల్యం తక్కువ చేసి సర్టిఫికెట్ ఇస్తున్నారని మండిపడ్డారు. దివ్యాంగులకు ఈ నెలలో తొలగించిన పింఛన్లు తక్షణం పునరుద్ధరించాలన్నారు. ఇకపై దివ్యాంగులకు ఏ కారణంగానూ పింఛను తొలగించకూదని డిమాండ్ చేశారు. అన్యాయం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ అర్చనకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సుధాకర్, కార్యదర్శి రామయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఎలా బతకాలి?
రెండేళ్లుగా పింఛను తీసుకుంటున్నా. ఇప్పుడు వైక్యలం తక్కువగా ఉందంటూ పింఛను తొలగిస్తే ఎలా బతకాలి. పింఛను డబ్బుతో మందులు కొనుక్కునేవాడిని. పెన్షన్ రాకపోతే మందుల కోసం డబ్బులు ఎవరిని అడుక్కోవాలి.
– రామలింగ, గోళ్ల గ్రామం,
కళ్యాణదుర్గం మండలం
84 శాతం వైకల్యాన్ని 40 శాతం చూపారు
బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న మా కుమారుడు రవితేజకు వచ్చేనెల నుంచి పింఛను నిలిపివేస్తున్నట్లు నోటీసు ఇచ్చారు. రవితేజకు ఆరేళ్ల వయసున్నప్పటి నుంచి పింఛను వస్తోంది. ఇప్పుడు 22 సంవత్సరాలు. 84 శాతం వైకల్యం ఉంటే రీ వెరిఫికేషన్‌లో 40 శాతం కంటే తక్కువగా ఉందని చెప్పారు. – కదిరప్ప, రమాదేవి, మరూరు గ్రామం, రాప్తాడు మండలం

పేద బతుకులతో ఆటలా?

పేద బతుకులతో ఆటలా?