
మా కష్టాలు తీర్చండి
● ‘పరిష్కార వేదిక’లో 550 వినతులు
అనంతపురం అర్బన్: ‘మా కష్టాలు తీర్చండి’ అంటూ ‘పరిష్కార వేదిక’లో అధికారులకు ప్రజలు విన్నవించుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ వినోద్‌కుమార్‌తో పాటు జేసీ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్‌ఓ ఎ.మలోల, ఎఫ్‌ఎస్‌ఓ జి.రామకృష్ణారెడ్డి తదితరులు అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 550 వినతులు అందాయి. కార్యక్రమం అనంతరం అధికారులతో కలెక్టర్ సమక్షించారు. అర్జీదారుల సమస్యను తెలుసుకుని వారు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపించాలని ఆదేశించారు.
వినతుల్లో కొన్ని...
● భూమి తక్కువ చేసి ఆన్‌లైన్‌లో చూపిస్తున్నారని శింగనమలకు చెందిన విక్రమ్‌కుమార్ ఫిర్యాదు చేశాడు. నరసాపురం గ్రామం సర్వే నంబరు 242–2సీలో 2.50 ఎకరాలు, 242–2బీలో 2.50 ఎకరాలు ఉందని, ఆన్‌లైన్‌లో మాత్రం నాలుగు ఎకరాలే నమోదు చేశారని వాపోయాడు.
● ఇంటి స్థలం ఇచ్చినట్లుగా పట్టాఫారం ఇచ్చారని, అయితే అఽధికారులు స్థలం చూపలేదని అనంత పురంలోని రహమత్ నగర్‌కు చెందిన ఉదయభాను ఫిర్యాదు చేసింది. ఇంటి స్థలం చూపించడంతో పాటు పక్కా గృహం మంజూరు చేసి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరింది.
● భర్త పింఛను తనకు ఇప్పించాలని బుక్కరాయసముద్రం గ్రామానికి చెందిన 75 ఏళ్ల బండి లక్ష్మక్క కోరింది. తన భర్త వెంకటరాముడుకు పింఛను వచ్చేదని, ఆయన రెండున్నరేళ్ల క్రితం మరణించాడని చెప్పింది. భర్త పింఛను ఇప్పించాలని ఏడాదిగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదంది. ఎవరూ లేని తనకు పింఛను వచ్చేలా చేసి ఆదుకోవాలని కలెక్టర్‌కు విన్నవించుకుంది.