తనకల్లు: శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం మండ్లిపల్లి వద్ద జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో తొమ్మిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు, రెండు టూరిస్ట్ మినీబస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో టూరిస్ట్ బస్సుల్లోని అనసూయమ్మ (60) అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ మణికంఠ (41), నాగేంద్రప్ప (45), జాహ్నవి (4) చికిత్స పొందుతూ మరణించారు. మృతులంతా కర్ణాటక వాసులే. పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని బళ్లారి ప్రాంతానికి చెందిన భక్తులు రెండు టూరిస్ట్ మినీబస్సుల్లో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. దైవదర్శనం అనంతరం బళ్లారికి తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యంలో మండ్లిపల్లి జాతీయ రహదారిపై ఉన్న మలుపు వద్ద కదిరి నుంచి మదనపల్లి వెళుతున్న పల్లెవెలుగు ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న టూరిస్ట్ బస్సు ఢీకొంది. ఆ వెనుకనే వస్తున్న మరో టూరిస్ట్ బస్సు ముందున్న టూరిస్ట్ బస్సును ఢీకొట్టింది. ఒకదానికొకటి బలంగా ఢీ కొనడంతో ముందున్న టూరిస్ట్ బస్సు నుజ్జనుజ్జయ్యింది. అందులో ప్రయాణిస్తున్న అనసూయమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి జాహ్నవి, డ్రైవర్ మణికంఠ, నాగార్జున, కుమార్‌స్వామి, భార్గవి, రిత్విక, నాగేంద్రప్ప, గోవిందమ్మ, గోవిందప్ప, రాకేష్, చిన్నమ్మ, అంజినమ్మ తీవ్రంగా గాయపడ్డారు. మండలంలో ఉచితంగా అంబులెన్స్ సేవలు నిర్వహిస్తున్న ‘వందేమాతరం టీం’ సభ్యులు బాధితుల్ని తమ అంబులెన్స్‌లో తనకల్లు ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు తీవ్రంగా గాయపడిన జాహ్నవి, నాగేంద్రప్ప, మణికంఠ, నాగార్జున, రిత్విక, భార్గవిలను కదిరి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వీరిలో డ్రైవర్ మణికంఠ, నాగేంద్రప్ప, జాహ్నవి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అనంతపురం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వీరు మృతిచెందారు. తనకల్లు ఎస్‌ఐ గోపి ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. మండ్లిపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి సంతాపం తెలిపారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
మృతి చెందిన అనసూయమ్మ, తనకల్లు ప్రభుత్వాసుపత్రిలో క్షతగాత్రులు
రోడ్డు ప్రమాదంలో
నలుగురు దుర్మరణం
మృతులు కర్ణాటక వాసులు
మరో 9 మందికి గాయాలు
ఢీకొన్న ఆర్టీసీ బస్సు,
రెండు టూరిస్ట్ బస్సులు
తిరుమల వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు
తిరుమల వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు
తిరుమల వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు