అన్నదాతకు రిక్తహస్తం!
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు కష్టాలు రెట్టింపు అయ్యాయి. అన్నదాత సుఖీభవ పథకం అమలులో నిబంధనల తిరకాసు అన్నదాతలను తీరని ఇబ్బందులకు గురి చేస్తోంది. అధికారులు సైతం కొర్రీలతో ముప్పుతిప్పలు పెడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల పేరుతో సవాలక్ష సాకులు వెతికి అర్హుల్లో చాలా మందికి రిక్తహస్తం చూపేలా కార్యాచరణ చేపట్టారు.
రాయదుర్గం: అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి రూ.20 వేలు ఆర్థిక సాయం అందించనున్నట్లు గత ఎన్నికల సమయంలో కూటమి పెద్దలు ఇచ్చిన హామీ అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా.. బాలారిష్టాలను దాటి ముందుకు సాగడం లేదు. ఇప్పటికే అర్హులైన రైతుల ఎంపిక ప్రక్రియ పూర్తి కావస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నా... పథకం లబ్ధి పొందేందుకు రైతులకు కొత్త చిక్కులు తప్పడం లేదు. గతంలో చేపట్టిన రీసర్వేను సాకుగా చూపి అర్హుల జాబితా నుంచి చాలా మందిని తొలగించేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది. ఈ కుట్ర కాస్త బహిర్గతం కావడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
చిక్కుముడులు విప్పకనే తుది జాబితా!
కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిసి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. పీఎం కిసాన్ యోజన కింద రూ.6 వేలతో పాటు మిగిలిన రూ.14 వేలను రాష్ట్ర ప్రభుత్వం రూ.20వేలను అందించనుంది. దీనికి వెబ్‌ల్యాండ్‌ను అనుసంధానిస్తూ పరిశీలన ప్రక్రియ చేపట్టాలని వ్యవసాయశాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఇక్కడే అసలు చిక్కు మొదలవుతోంది. రీ–సర్వేల్లో భాగంగా కొందరు రైతుల ఆధార్, సెల్ నంబర్‌తో పాటు ఇతర వివరాలనూ అధికారుల నమోదు చేయకపోవడం, ఆన్‌లైన్‌లో భూములున్నా ఆధార్ అనుసంధానికి రెవెన్యూ అధికారులు చుక్కలు చూపడం లాంటి కారణాలు వెరసి తహసీల్ధార్, వ్యవసాయశాఖ కార్యాలయాల చుట్టూ రైతులు నిత్యం తిరిగి వేసారి పోతున్నారు. వెబ్‌ల్యాండ్‌లో పరిశీలన ప్రక్రియ పూర్తి కావడంతో చాలా మంది రైతులు అనర్హులుగా మిగిలిపోయారు. డి.హీరేహాళ్ మండలంలో ఓ అధికారి నిర్వాహకంతో రైతుల కష్టాలు రెట్టింపు అయ్యాయి. వెబ్‌ల్యాండ్‌లోని చిక్కుముడులను విప్పకనే తుది జాబితాకు అధికారులు సిద్ధం కావడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఏడాదిగా ఇదే నాన్చుడు
గత వైఎస్సార్‌సీపీ హయాంలో ఖరీఫ్ ఆరంభానికి ముందే రైతు భరోసా పథకం కింద అర్హులైన ప్రతి రైతుకూ పెట్టుబడి సాయాన్ని అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తూ వచ్చారు. విత్తు నుంచి విపత్తుదాక వెన్నంటే నిలిచారు. ఏటా రెండు లక్షల మందికి పైగా రైతులకు రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా ఐదేళ్ల పాటు రైతులకు రూ.1879.29 కోట్ల సాయాన్ని అందించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని పేరు మార్చి అన్నదాత సుఖీభవ పథకంగా నామకరణం చేసి అమలులో ఏడాది పాటు నాన్చుడు ధోరణి అవలంభిస్తూ వచ్చింది. దీనిపై అన్నదాతల్లో అసహనం వ్యక్తం కావడంతో ఓ మెట్టు దిగి వచ్చిన కూటమి సర్కార్... పథకం అమలు పేరుతో కొర్రీలు విధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తోంది. జిల్లాలో 4.74 లక్షల మంది రైతులుండగా వీరిలో 2,98,535 మందికి అన్నదాత సుఖీభవ పథకం వర్తించాల్సి ఉంది.
అన్నదాత సుఖీభవ పథకం అమలులో కనిపించని కష్టాలు
సవాలక్ష నిబంధనలతో రైతుకు తప్పని తిప్పలు
అర్హుల్లో చాలా మందికి రిక్తహస్తం చూపేలా కార్యచరణ


