హెచ్చెల్సీలో ఫెవికాల్ వీరులు
● హెచ్చెల్సీలో ఓ ఉద్యోగి 25 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఈయన తన సర్వీసులో అన్ని ప్రాంతాల్లో పనిచేసి ఉంటారని అనుకుంటే పొరపాటే. అనేక సంవత్సరాలుగా ఎస్‌ఈ కార్యాలయంలోనే ఉండిపోయారు. డిప్యుటేషన్ ముసుగులో ‘ఫెవికాల్’ వేసుకొని తిష్ట వేసినట్లు విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఈయనకు ప్రత్యేకంగా గది కేటాయించడం చర్చనీయాంశంగా మారింది.
● ఓ ఇరిగేషన్ ఉద్యోగి జిల్లా కేంద్రంలో దాదాపు 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. హెచ్చెల్సీ ఎస్‌ఈ కార్యాలయం, లోక్ డివిజన్, ధర్మవరం డివిజన్ అంటూ జిల్లా కేంద్రంలోనే తిరుగుతున్నారు తప్ప ఏనాడు క్షేత్రస్థాయిలో పనిచేసిన దాఖలాలు లేవు. ఇలాంటి ఉద్యోగులు హెచ్చెల్సీలో దాదాపు 25 మంది విధులు నిర్వహిస్తుండడం గమనార్హం.
అనంతపురం సెంట్రల్: జిల్లాలో తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) ప్రాజెక్టు కీలకమైంది. ఉమ్మడి జిల్లా మొత్తానికి తాగునీరు, దాదాపు 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. అలాంటి ప్రాజెక్టులో పాలన పూర్తిగా గాడి తప్పుతోంది. ఉద్యోగుల నియామకాల్లో విపరీతమైన రాజకీయం సాగుతోంది. పలుకుబడి ఉన్న వాళ్లు ఎప్పుడూ కీలక స్థానాల్లో ఉంటున్నారు. పైరవీలు చేయడం... ప్రాధాన్య సీట్లను దక్కించుకోవడం పరిపాటిగా మారింది. అధికారులు కూడా వీరికే వత్తాసు పలుకు తుండటంతో చాలా మంది ఉద్యోగుల సర్వీసు మొత్తం సుదూర ప్రాంతాల్లోనే సాగుతోంది. వాస్తవానికి నీటి సరఫరా జరిగే సమయంలో పరిపాలన సౌలభ్యం దృష్ట్యా డిప్యుటేషన్‌లు వేసుకునే వెసులు బాటు ఉంటుంది. సరఫరా ఆగిన తర్వాత యథావిధిగా వారి స్థానాలకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ హెచ్చెల్సీలో ఏళ్లుగా డిప్యుటేషన్‌లోనే విధులు నిర్వహిస్తున్నారు. ఓ ఉద్యోగి తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి జిల్లా కేంద్రంలోనే ఉంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఈసారి కూడా పైరవీలకే పెద్దపీట..!
బదిలీలకు ప్రభుత్వం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడు నుంచి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నవారికి, మ్యూచువల్, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారందరికీ బదిలీలు కావాలని ఉత్తర్వులు ఇచ్చింది. జూన్ 2 లోపు ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. హెచ్చెల్సీలో ఇప్పటి వరకూ బదిలీల గురించి అధికారికంగా ప్రకటించకపోయినా... ఇప్పటికే ఆ తంతు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సారి కూడా పైరవీలతో కొందరు ఉద్యోగులు చక్రం తిప్పినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధుల సిఫార్సులతో కొన్ని, డిప్యుటేషన్‌లతో కొన్ని పోస్టులను నియమిస్తున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక భారీగానే ముడుపులు ముడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
నిబంధనల ప్రకారం ముందుకెళ్తాం
ఉద్యోగుల బదిలీలు నేటిలోపు పూర్తి చేయాల్సి ఉంది. జేఈలు, డీఈలు, ఈఈల బదిలీలు ఈఎన్‌సీ స్థాయిలో ఉంటాయి. మిగిలిన పోస్టులకు ఎస్‌ఈ స్థాయిలో బదిలీలు చేస్తాం. జీఓ ప్రకారం ఉద్యోగుల బదిలీలు నిర్వహిస్తామే తప్ప ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించే పరిస్థితి ఉండదు. డిప్యుటేషన్‌ల రద్దు విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం.
– పురార్థనరెడ్డి, ఎస్‌ఈ, హెచ్చెల్సీ
హెచ్చెల్సీ ఎస్‌ఈ కార్యాలయం
ఏళ్లుగా జిల్లా కేంద్రంలోనే విధులు డిప్యుటేషన్ ముసుగులో తిష్ట అధికారులకు బురిడీ


