కంచె.. చేను మేసింది! | - | Sakshi
Sakshi News home page

కంచె.. చేను మేసింది!

May 16 2025 12:39 AM | Updated on May 16 2025 12:39 AM

కంచె.

కంచె.. చేను మేసింది!

ఆర్టీసీలో అధికారి ధన దాహానికి 60 మంది బలి

జోనల్‌ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ అధికారి ముజఫర్‌ రహిమాన్‌ నయా దందా

పక్కా ఆధారాలతో ఎండీకి నివేదిక

విచారణలో వెలుగు చూస్తున్న వాస్తవాలు

రోజుకో మలుపు తిరుగుతున్న అక్రమాల బాగోతం

వసూళ్లకు 9 మంది ఏజెంట్లు

రూ.కోట్లలో దండుకున్న వైనం

అనంతపురం క్రైం: క్రమ శిక్షణకు మారుపేరుగా ఉన్న ఆర్టీసీలో ఉన్నతాధికారులే దారి తప్పారు. కింది స్థాయి ఉద్యోగులకు పర్యవేక్షకులుగా ఉండాల్సిన వారే దిక్కుమాలిన పనులు చేసి అడ్డంగా దొరికిపోయారు. కొంత కాలంగా ఆర్టీసీ జోనల్‌ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ అధికారిగా పని చేసిన ముజఫర్‌ రహిమాన్‌ అక్రమాల బాగోతం ప్రస్తుతం ఆ సంస్థను కుదిపేస్తోంది. అతనిపై చర్యలు తీసుకున్నా.. నేటికీ ఇంకా ఆయన బాధితులు కార్యాలయానికి క్యూ కడుతూనే ఉన్నారు. ఏకంగా 9 మంది ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని సుమారు రూ. 2 కోట్లకు పైగా ఆయన దోచుకున్నట్లు అధికారికంగా గుర్తించారు. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులే చెబుతుండడం గమనార్హం.

60 మందికి పైగా బాధితులు

అనంతపురం, కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల పరిధిలో సుమారు 60 మందికిపైగా ముజఫర్‌ రహిమన్‌ బాధితులున్నట్లు విచారణాధికారులు గుర్తించారు. వీరందరినీ కార్యాలయానికి పిలిపించి విచారణ చేపట్టారు. కొందరు మహిళా ఉద్యోగుల విషయంలోనూ ముజఫర్‌ అసభ్యంగా ప్రవర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. కింది స్థాయి సిబ్బందిపై చిన్నపాటి ఆరోపణ వచ్చినా నేరుగా వారిని పిలిపించుకుని లోబరుచుకోవాలన్న ప్రయత్నాలు చేసినట్లుగా ఆరోపణలున్నాయి. జోన్‌ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 29 మందిని విచారణ చేసిన అధికారులు... వారి నుంచి ముజఫర్‌ రూ.16,65,650లు వసూలు చేసినట్లు నిగ్గు తేల్చారు. ఇంకా విచారణ కొనసాగుతోంది. రూ.2 కోట్ల వరకు కొల్లగొట్టినట్లుగా ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు.

ముఠాను ఏర్పాటు చేసి..

ఆర్టీసీ కడప జోనల్‌ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ అధికారి ముజఫర్‌ రహిమాన్‌ తనదంటూ ప్రత్యేక అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని, దోపిడీకి తెరలేపారు. మూడు జిల్లాల పరిధిలోని కీలక విభాగాల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులను ఎంపిక చేసుకుని వారి ద్వారా యథేచ్ఛగా అక్రమ వసూళ్లకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రాథమిక విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు... ముజఫర్‌ రహిమాన్‌కు సంబంధించిన 9 మంది ఏజెంట్లను గుర్తించారు. అనంతరం ముజఫర్‌పై సస్పెన్షన్‌ వేటు వేసి సమగ్ర విచారణ చేపట్టారు. ముజఫర్‌ ముఠాలో కీలకంగా కేవీ రెడ్డి, ఎన్‌పీఎల్‌ఎన్‌వీ ప్రసాద్‌, యూఎన్‌ఎస్‌ రెడ్డి, జీవీజీ రమణ, మనోహర్‌, కేఆర్‌సీ రెడ్డి, ఆర్‌ఎంఎస్‌ నాయక్‌, శివకుమార్‌, శంకరయ్య ఉన్నట్లుగా నిర్ధారించారు. ఇంకా ఈ జాబితాలో విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ విభాగానికి చెందిన మరి కొందరు ఉన్నట్లు సమాచారం.

తారస్థాయిలో అక్రమాల బాగోతం

అనంతపురం ఆర్టీసీలో ఉన్నతాధికారులు కూడా ఇదే మార్గం నడిచినట్లు ఆరోపణలున్నాయి. గుత్తి డిపోలో కొంత కాలంగా ఉద్యోగుల పనితీరుపై అనేక ఆరోపణలున్నాయి. అలాగే ఉరవకొండ ఆర్టీసీ డిపోలోనూ రూ.42 లక్షల వ్యవహారం ఇంకా ఎటూ తేలలేదు. దీనికి తోడు అనంతపురం కార్గో అధికారి అద్దె వాహనం పేరుతో చేసిన మోసంపై ఎలాంటి చర్యలూ లేవు. ఇలా అనంతపురం ఆర్టీసీలోని ఉన్నతాధికారుల అవినీతి బాగోతం కూడా వెలుగు చూస్తుండడంతో కార్మికుల్లో అసహనం రేకెత్తుతోంది. ఆర్టీసీ ఆర్‌ఎం స్థాయి అధికారి కూడా అక్రమాలకు పాల్పడిన వారికి దన్నుగా నిలుస్తూ వారిని కాపాడేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఈ అవినీతి అక్రమాలపై ఆర్టీసీ ఎండీ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సంస్థ కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీలోని యూనియన్‌ల నేతలు మాత్రం తాజాగా ఎండీని కలసి ఉద్యోగులు, కార్మికుల నుంచి జోనల్‌సెక్యూరిటీ అండ్‌ విజిలెన్స్‌ అధికారి ముజఫర్‌ రహిమాన్‌ బాధితులకు తిరిగి డబ్బు ఇప్పించాలని విన్నవించిసట్లు తెలుస్తోంది.

కంచె.. చేను మేసింది! 1
1/1

కంచె.. చేను మేసింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement