గుంతకల్లు: ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి సాధ్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డి.జగదీష్ అన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 ఎన్నికల సమయంలోనూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని పార్లమెంట్ సాక్షిగా స్వయంగా ప్రధాన మంత్రి మోదీ ప్రకటించారని గుర్తు చేశారు. నేటికీ ఈ హామీకి దిక్కు లేకుండా పోయిందన్నారు. అమరావతి శంకుస్థాపనకు ఇటీవల వచ్చిన మోదీ... రాష్ట్ర రాజధాని అభివృద్దికి రూ.45వేల కోట్ల నిధులను కేటాయించినట్లు గొప్పగా ప్రకటించారన్నారు. అయితే ఇందులో కేవలం 10శాతం మాత్రమే కేంద్రం భరిస్తోందని, మిగిలిన 90 శాతాన్ని రాష్ట్రానికి అప్పుగా ఇస్తోందని గుర్తు చేశారు. అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ కేవలం అప్పులతోనే రాష్ట్రాన్ని కూటమి సర్కార్ నెట్టుకొస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ అభివృద్ది వైపు పరుగులు పెట్టాలంటే ఒక్క ప్రత్యేక హోదాతోనే సాధ్యమన్నారు. ఈ అంశంపై కూటమి పెద్దలు పోరాటాలకు సిద్ధమైతే పార్టీలకు అతీతంగా అందరూ కలసి వస్తారన్నారు. కులగణనను కేవలం బిహార్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ నాయకులు గోవిందు, వీరభద్రస్వామి, మహేష్, గోపీనాథ్, ఎస్‌ఎండీ గౌస్, రామురాయల్, మురళి తదితరులు పాల్గొన్నారు.
విలేకరుల సమావేశంలో సీపీఐ నేత జగదీష్


