కేసులతో భయపెట్టాలని చూస్తున్న ప్రభుత్వం : అనంత
అనంతపురం ఎడ్యుకేషన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారం కంటే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు, అరెస్ట్‌లపైనే ఎక్కువ దృష్టి సారిస్తోందని, కేసులతో భయపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తోందనివైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. బెయిల్‌పై వచ్చిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్‌ను గురువారం ఆయన నివాసంలో అనంత వెంకట్రామిరెడ్డి కలసి మాట్లాడారు. ప్రశ్నించే వారిని భయపెట్టి అణచి వేయాలని చూడడం ఓ విధంగా కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్ధతి కాదన్నారు. ప్రభుత్వ పెద్దల తీరు మారకపోతే పర్యావసనాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉండడం వైఎస్సార్‌సీపీకి కొత్తేం కాదన్నారు. కచ్చితంగా ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మాధవ్‌ను కలిసిన వారిలో డీసీసీబీ మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, పార్టీ బీసీ సెల్ రాష్ట్ర నాయకుడు ధనుంజయయాదవ్ ఉన్నారు.


