ఐకమత్యంగా జీవించండి
యల్లనూరు: ఐకమత్యంతో స్వేచ్ఛగా, శాంతియుతంగా జీవించాలని యల్లనూరు మండలం నిట్టూరు వాసులకు కలెక్టర్ వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. 85–నిట్టూరు గ్రామంలో బుధవారం నిర్వహించిన పౌరహక్కుల దినోత్సవానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అసిస్టెంట్ కలెక్టరు సచిన్ రహర్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టరు కొంకిరి కమలమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టరు మాట్లాడుతూ.. ప్రతి నెల ఓ గ్రామాన్ని ఎంపిక చేసి పౌరహక్కుల దినోత్సవాన్ని జరుపుతామన్నారు.అన్ని శాఖల అధికారులు, పోలీసులు తప్పక పాల్గొని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై చర్చించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు. ఆర్డీఓ కేశవనాయుడు మాట్లాడుతూ.. గ్రామంలో కొన్ని భూ సమస్యలు ఉన్నాయని వాటిని చట్ట ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం గ్రామంలోని దళిత వాడలో పర్యటించారు. పుష్పలత, బాలరాజు ఇంటికి వెళ్లి సమస్యలపై ఆరా తీశారు. మురుగు నీరు రోడ్లపై ప్రవహించకుండా సీసీ డ్రెయినేజీలు ఏర్పాటు చేయాలని ఎంపీడీఓ వాసుదేవరెడ్డిని ఆదేశించారు. కాలనీకి వాటర్ ట్యాంకు ఏర్పాటు చేయాలని, శ్మశాన వాటికకు దారి చూపాలని స్థానికులు కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశులు, తహసీల్దారు శేషారెడ్డి, ఎంపీపీ గంగాదేవి, ఎంపీటీసీ శ్రీదేవి, సర్పంచ్ శారద, సోషల్ వెల్పెర్ జేడీ రాధిక, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
నిట్టూరు వాసులతో కలెక్టర్ వినోద్‌కుమార్


