నిరవధిక సమ్మెలో ఎంఎల్‌హెచ్‌పీలు
అనంతపురం మెడికల్: తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం మంగళవారం ప్రభుత్వ సర్వజనాస్పత్రి ఎదుట మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు/కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్/కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు గౌరి, అనూష, రాజేశ్వరి, శ్వేత మాట్లాడుతూ... ఆయుష్మాన్ భారత్ నిబంధన ప్రకారం ఆరేళ్లు పూర్తి చేసుకున్న సీహెచ్‌ఓలను రెగ్యులరైజేషన్ చేయాలని, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్దీకరించాలని, ఈపీఎఫ్‌ఓ పునరుద్ధరించాలని కోరారు. క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలని, నిర్ధిష్టమైన జాబ్‌చార్ట్ అందించాలని, ఎఫ్‌ఆర్‌ఎస్ నుంచి సీహెచ్‌ఓలకు మినహాయింపు ఇవ్వాలని, హెచ్‌ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్, బదిలీలు, ఎక్స్‌గ్రేషియా, పితృత్వ సెలవులు ఇవ్వాలన్నారు. తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించే వరకూ సమ్మెను విరమించబోమన్నారు.


