మహిళా చైతన్యానికి సైకిల్‌యాత్ర
● పర్వతారోహకురాలు, సైకిలిస్ట్ సమీరాఖాన్
అనంతపురం అర్బన్: మహిళ సాధికారత, వరకట్న వేధింపులు, గృహహింసపై దేశ వ్యాప్తంగా మహిళల్లో చైతన్యం కల్పించేందుకు సైకిల్ యాత్ర చేపట్టినట్లు అనంతపురానికి చెందిన పర్వతారోహకురాలు, సైకిలిస్ట్ సమీరాఖాన్ తెలిపారు. తన యాత్ర నేపాల్ వరకూ సాగుతుందన్నారు. సైకిల్ యాత్రను కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ మంగళవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళా సాధికారత కింద ఎవరెస్ట్ పర్వతారోహణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోలో సైక్లింగ్ క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ప్రారంభించే ముందు మహిళ సాధికారతపై దృష్టి పెట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి బి.ఉదయ్‌భాస్కర్, కోచ్‌లు, క్రీడాకారులు పాల్గొన్నారు.
దొంగకు దేహశుద్ధి
గుత్తి: స్థానిక రఘురాం రెడ్డి కాంప్లెక్స్‌లో ఉన్న రాధాకృష్ణ డ్రస్ సెంటర్‌లో నగదు అపహరించిన యువకుడికి నిర్వాహకులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మంగళవారం ఉదయం డ్రస్ సెంటర్‌లో ప్రవేశించిన యువకులు క్యాష్ బ్యాక్స్‌లోని రూ.10 వేలు అపహరిస్తూ పట్టుబడ్డాడు. పట్టుబడిన యువకుడిని గుత్తి ఆర్‌ఎస్‌కు చెందిన భాస్కర్‌గా గుర్తించారు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కేజీబీవీల్లో ‘ప్రత్యేక’ తరగతులు
అనంతపురం ఎడ్యుకేషన్: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో (కేజీబీవీ) చదువుకుంటూ పదోతరగతి, ఇంటర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థినుల కోసం ప్రత్యేక తరగతులు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 32 కేజీబీవీల్లోని విద్యార్థినుల కోసం నల్లమాడ, గుమ్మఘట్ట, ఉరవకొండ, తాడిపత్రి, శింగనమల కేజీబీవీల్లో ప్రత్యేక తరగతులు జరుగుతున్నాయి. ఇంటర్‌లో 437 మంది, పదో తరగతిలో 303 మంది విద్యార్థినులు ఫెయిలయ్యారు. ఒక్కో కేంద్రంలో 128 నుంచి 175 మందిని కేటాయించి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇంటర్, పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యే ముందు రోజు వరకూ ఈ ప్రత్యేక తరగతులు కొనసాగుతాయి. ఇందుకోసం కేజీబీవీల్లోని టీచింగ్ స్టాఫ్ సీఆర్టీలకు ప్రత్యేక షెడ్యూలును ఖరారు చేశారు. ఈ ప్రక్రియను సమగ్రశిక్ష ఏపీసీ టి.శైలజ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.
మహిళా చైతన్యానికి సైకిల్‌యాత్ర


