ఆలూరు సాంబ విదేశీ పర్యటన
అనంతపురం కారొపరేషన్: వైఎస్సార్‌సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఎన్‌ఆర్‌ఐ విభాగం గ్లోబల్ కో ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి విదేశీ పర్యటన వెళ్లనున్నారు. మంగళవారం మే 12వ తేదీ వరకూ ఆయన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్ దేశాలలో పర్యటించనున్నారు. 2029లో వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తీసుకువచ్చి సీఎంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చేసుకోవడంలో భాగంగా ప్రవాసాంధ్రుల మద్దతును కూడగట్టుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ... గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ చేపట్టిన విప్లవాత్మక మార్పులతో రాష్ట్రాభివృద్ధి, ఆర్థిక రంగం పురోగతి, ప్రజలకందించిన సంక్షేమం, 2023లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడంలో విజయవంతం, ఆరు నూతన పోర్టులు, 4 నూతన ఎయిర్‌పోర్టులు, నాడు–నేడు కింద 60వేల పాఠశాలల ఆధునికీకరణ, 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు తదితర అంశాలపై ప్రవాసాంధ్రులను చైతన్య పరచనున్నట్లు తెలిపారు.
నెట్టికంటుడికి
కిలో వెండి బహూకరణ
గుంతకల్లు రూరల్: మండలంలోని కసాపురంలో వెలసిన నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి డి.హీరేహాళ్ మండలం పులకుర్తి గ్రామానికి చెందిన భక్తుడు బి.శ్రీధర్‌రెడ్డి కిలో బరువున్న వెండి సామగ్రిని బహూకరించారు. ఈ సందర్భంగా దాతల కుటుంబ సభ్యుల పేరున ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు.
ప్రమాదంలో వ్యక్తి మృతి
తాడిపత్రి: లారీని వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో ఓ ద్విచక్ర వాహన చోదకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... తాడిపత్రి మండలం సజ్జలదిన్నెకు చెందిన నరసింహులు (58)కు భార్య వరలక్ష్మి, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. మంగళవారం ఉదయం వ్యక్తిగత పనిపై భార్యతో కలసి నరసింహులు ద్విచక్ర వాహనంలో వైఎస్సార్ జిల్లా కడప వైపుగా బయలుదేరాడు. వీరాపురం గ్రామం వద్దకు చేరుకోగానే నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కగా ఆపిన లారీని వెనుక నుంచి ఢీకొన్నాడు. ప్రమాదంలో నరసింహులు తీవ్రంగా గాయపడగా, వరలక్ష్మి స్వల్ప గాయాలతో బయటపడింది. క్షతగాత్రులను స్థానికులు వెంటనే తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక నరసింహులు మృతిచెందాడు. ఘటనపై తాడిపత్రి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఆలూరు సాంబ విదేశీ పర్యటన


