జిల్లాలో విస్తృత తనిఖీలు
అనంతపురం: పెహల్గాంలో ఉగ్ర దాడి నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎస్పీ జగదీశ్ ఆదేశాలతో జిల్లా అంతటా శనివారం ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ప్రత్యేక బృందాలు ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర జన సమ్మర్థం కలిగిన ప్రాంతాలు, హోటళ్లు, లాడ్జీల్లో సోదాలు నిర్వహించాయి. సరిహద్దు ప్రాంతాల్లోనూ ముమ్మర తనిఖీలు చేపట్టారు. పార్శిల్ కార్యాలయాలను సైతం విస్తృతంగా తనిఖీ చేశారు.
గుంతకల్లు: స్థానిక రైల్వేస్టేషన్‌లో శనివారం వన్ టౌన్ సీఐ మనోహర్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎఆర్ హెడ్ క్వార్టర్ నుంచి ప్రత్యేక టీమ్‌తోపాటు డాగ్ స్కాడ్‌తో స్టేషన్‌లోని అన్ని ప్లాట్‌ఫారమ్‌లతోపాటు ప్రయాణికుల రెస్ట్‌రూములు, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులకు చెందిన బ్యాగులను తనిఖీ చేశారు. గంజాయి, అక్రమ మద్యం రవాణా జరగకుండా గట్టి చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు.
తాడిపత్రిటౌన్: పట్టణంలోని ఆర్డీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్లలో శనివారం పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ పార్సిల్ సర్వీస్‌లలో వచ్చిన పార్సిల్ బాక్స్‌లను జాగిలాలతో సోదాలు చేయించారు. రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేశారు. సీఐ సాయిప్రసాద్, ఎస్‌ఐ ఖాజాబాషా, సిబ్బంది పాల్గొన్నారు.


