కాలువ లైనింగ్‌తో రైతులకు విఘాతం
అనంతపురం: హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనులతో అనంత రైతన్న తీవ్రంగా నష్టపోతాడని జలసాధన సమితి నాయకుడు, ప్రముఖ న్యాయవాది రామకుమార్ అన్నారు. ‘రాయలసీమ కరువు– నీటి సవాళ్లు– వాటి పరిష్కార మార్గాలు – సాధ్యాసాధ్యాలు’ అంశంపై శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఏఐఎస్‌ఏ (ఆలిండియా స్టూడెంట్ అసోసియేషన్ ) రాష్ట్ర అధ్యక్షుడు వేమన ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాయలసీమలో ప్రతి ప్రాంతానికి హంద్రీ–నీవా ద్వారా నీరు ఇచ్చినప్పుడే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దక్కుతుందన్నారు. ప్రస్తుతం 53 వేల ఎకరాల భూమితో పాటు అదనంగా మరో 44 వేల ఎకరాల భూమిని అమరావతి రాజధాని ప్రాంతానికి సేకరించి మరోసారి నిర్భంధ అభివృద్ధి కేంద్రీకరణ చేస్తున్నారన్నారు. ఫలితంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు తీరని అన్యాయం చేస్తున్నారని రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పిరెడ్డి నాగార్జునరెడ్డి అన్నారు. సిద్ధేశ్వరం వద్ద కృష్ణా నదిపై కేంద్రం నిర్మిస్తున్న నేషనల్ హైవేలో భాగంగా తీగల వంతెన నిర్మాణం బదులుగా బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ నిర్మించాలని ప్రభుత్వం కోరకపోవడం అన్యాయమన్నారు. కర్ణాటకలో చేటప్టిన అప్పర్‌భద్ర నిర్మాణాన్ని మన పాలకులు ఆపలేకపోవడంతో రాయలసీమ పశ్చిమ ప్రాంతానికి జీవనాధారమైన హెచ్చెల్సీ, ఎల్‌ఎల్‌సీ ఆయకట్టు పూర్తిగా ఎడారిగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ ఉద్యమానికి సోషల్ మీడియా ద్వారా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ నాయకుడు సాకే హరి, అశోక్ వర్ధన్, రామాంజినేయులు, రాహుల్ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, రాయలసీమ విద్యావంతుల వేదిక నాయకులు వెంకటేశ్, లక్ష్మీవిశ్వనాథ్, హరిత, అరుణోదయ కళాకారులు చంద్రన్న, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
జల సాధన సమితి నాయకులు


