అంతర్రాష్ట్ర డీజిల్ దొంగల ముఠాలో ‘పచ్చ’ నేత!
సాక్షి టాస్క్‌ఫోర్స్: అంతర్రాష్ట్ర డీజిల్ దొంగల ముఠాలో ఓ ‘పచ్చ’ నేత ఉండటం సర్వత్రా చర్చనీయాంశమైంది. మంత్రి పయ్యావుల కేశవ్‌తో సదరు ‘పచ్చ’ నేత దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వివరాలు.. వజ్రకరూరు మండలం వీపీపీ తాండా (వెంకటాంపల్లి పెద్దతండా)కు చెందిన టీడీపీ నాయకుడు ఎస్‌కే మహేష్‌నాయక్ బంజారా గిరిజన సమాఖ్య (బీజీఎస్) ఏర్పాటు చేశాడు. సమాఖ్యకు జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. మంత్రి పయ్యావుల కేశవ్, ఆయన సోదరుడు పయ్యావుల శ్రీనివాసులుకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందాడు. మహేష్‌నాయక్ కొన్నాళ్ల క్రితం తెలంగాణకు చెందిన కొందరితో జట్టు కట్టాడు. తెలంగాణతో పాటు మన రాష్ట్రంలో రాత్రి వేళ పెట్రోల్ బంకుల వద్ద, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీలను టార్గెట్ చేసేవాడు.కారులో వచ్చి లారీల నుంచి డీజిల్‌ను దొంగతనం చేసి ఉడాయించేవాడు. దొంగిలించిన డీజిల్‌ను బయట మార్కెట్లో విక్రయించి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. పలువురి ఫిర్యాదు మేరకు ఈ ముఠాపై నిఘా ఉంచిన కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు పక్కా సమాచారంతో కొందరు ముఠా సభ్యుల్ని ఇటీవల పట్టుకున్నారు. ముఠాలో మహేష్‌నాయక్ ముఖ్య నాయకుడిగా చెలామణి అవుతున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
బ్లాక్‌మెయిలింగ్‌లు.. సెటిల్‌మెంట్‌లు
మహేష్‌నాయక్ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. జిల్లా గిరిజన శాఖలో అధికారులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకునేవాడని తెలిసింది. దీంతో పాటు తన సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని పంచాయితీలు, సెటిల్‌మెంట్‌లు చేసేవాడని సమాచారం. ఏది ఏమైనా.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ‘పచ్చ’ నేతల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ‘తమ్ముళ్లు’ చేస్తున్న అరాచకాలు, అక్రమాలను చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు.


