
1.20 కోట్ల పనిదినాలు..రూ.368 కోట్ల నిధులు
రాయదుర్గం: ఉపాధి హామీ పథకం కింద పని దినాల లక్ష్యం ఖరారైంది. జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.368 కోట్లతో 1.20 కోట్ల పని దినాలు కల్పించేలా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళిక రూపొందించింది. ఈ క్రమంలో జూన్ ఆఖరుకు జిల్లాలోని 31 మండలాల్లో 68 లక్షల పనిదినాలు పూర్తి చేసేలా ఉన్నతాధికారులు లక్ష్యం నిర్దేశించారు. ఒక్కో కూలీకి సగటు వేతనం రూ.307 చెల్లించేలా కార్యాచరణ చేపట్టారు. ఇంకుడు గుంతలు, పశువుల షెడ్లు, నర్సరీల్లో మొక్కల పెంపకం, చెక్‌డ్యాంలు, వ్యక్తిగత మరుగు దొడ్లు, పంట పొలాలకు అనుసంధానంగా రోడ్లు, నీటి కుంటల నిర్మాణాలు, మొక్కలు నాటడం లాంటి పనులకు పెద్దపీట వేయనున్నట్లు తెలిసింది.
దొంగ మస్టర్ల కలకలం..
కూటమి ప్రభుత్వం వచ్చాక ఉపాధి నిధులు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.చాలా చోట్ల గత వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిన పనుల వద్దే మళ్లీ తూతూమంత్రంగా పనులు చేస్తున్నారని, మరి కొన్నిచోట్ల వృథా పనులకు ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలున్నాయి.ఇటీవల కొన్ని మండలాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల దొంగ మస్టర్ల మాయాజాలం కలకలం రేపింది. కూలీలు పనులకు రాకున్నా హాజరు వేస్తూ డబ్బులు మింగేస్తున్న వైనం అందరినీ విస్మయానికి గురి చేసింది. జిల్లా సరిహద్దు మండలాల్లో అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక.. కూటమి ప్రభుత్వంలో కొత్తగా పుట్టుకొచ్చిన శ్రమశక్తి సంఘాల ముసుగులో అర్హులకు అన్యాయం జరిగే అవకాశం లేకపోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పనులను అధికారులు నిత్యం తనిఖీ చేయడంతో పాటు ప్రతి మస్టర్‌ను నిశితంగా పరిశీలించాకే వేతనాలు జమ చేయాలని ఉపాధి కూలీలు డిమాండ్ చేస్తున్నారు.
‘ఉపాధి’ ప్రణాళిక ఖరారు
సగటు వేతనం రూ.307కు పెంపు
జూన్ ఆఖరుకు 68 లక్షల పనిదినాలు పూర్తి చేసేలా కార్యాచరణ
అక్రమాలు లేకుండా చర్యలు తీసుకోవాలంటున్న కూలీలు
అక్రమాలకు తావులేదు
ఉపాధి పథకంలో ఈ ఏడాది లక్ష్యం మేరకు పనులు కల్పిస్తాం. అడిగిన ప్రతి కూలీకి పని చూపుతాం. సగటు వేతనం రూ.307 పొందేలా అవగాహన కల్పిస్తున్నాం. గతేడాది 1.10 కోట్ల పని దినాలు ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో 1.20 కోట్లకు పెంచాం. మస్టర్లలో అవకతవకలు జరగకుండా పటిష్ట చర్యలు చేపడతాం. పనులకు రాకుండా వేతనాలు జమ చేసినట్టు తేలితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవు. – సలీమ్‌బాష, డ్వామా పీడీ

1.20 కోట్ల పనిదినాలు..రూ.368 కోట్ల నిధులు