ఆగని ‘కూటమి’ కక్ష సాధింపులు
● ఉరవకొండలో మరికొందరు వైఎస్సార్‌సీపీ నేతలకు పోలీసు నోటీసులు
ఉరవకొండ: వైఎస్సార్ సీపీ నాయకులపై కూటమి సర్కారు కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ గత ఏడాది డిసెంబర్ 27న ఉరవకొండలో పోరుబాట పేరుతో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ శ్రేణులే కాకుండా ప్రజలు కూడా కదం తొక్కడంతో కార్యక్రమం విజయవంతమైంది. ఈ క్రమంలో దీన్ని ఓర్వలేని స్థానిక టీడీపీ నేతలు విద్యుత్ అధికారిపై ఒత్తిడి చేసి కేసు పెట్టించారు. ర్యాలీతో ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిందంటూ ఓ ‘పచ్చ’ నాయకుడి ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. దీనిపై ఫిబ్రవరి 2న కొంతమంది వైఎస్సార్‌సీపీ నాయ కులను పిలిచి విచారణ చేపట్టిన పోలీసులు తిరిగి సోమవారం మరో 10 మంది పార్టీ ముఖ్య నాయకులకు నోటీసులు అందించడం గమనార్హం. ఈ సందర్భంగా నోటీసులు అందుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు బసవరాజు, ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ ఈడిగప్రసాద్ మాట్లాడుతూ అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరు కొనసాగిస్తామన్నారు. ఉరవకొండలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని, మంత్రి కేశవ్ అండతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని విమర్శించారు. నోటీసులు అందుకున్న వారిలో ఉరవకొండ రూరల్, మండల కన్వీనర్లు ఎర్రిస్వామిరెడ్డి, మూలగిరిపల్లి ఓబన్న, నాయకులు శింగనమల్ల ఉస్మాన్, సుద్దాల వెంకటేష్, వడ్డే ఆంజినేయులు, వెలిగొండ నాగన్న, అనిల్, బూదగవి ధనంజయలు తదితరులు ఉన్నారు.


