రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు

Apr 8 2025 10:50 AM | Updated on Apr 8 2025 12:39 PM

మంత్రి పయ్యావుల కేశవ్‌

ఉరవకొండ: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని, అప్పులు చేస్తే తప్ప ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. సోమవారం ఆయన ఉరవకొండ నియోజకవర్గంలో హంద్రీ–నీవా కాలువ విస్తరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేశవ్‌ మాట్లాడుతూ రాష్ట్రానికి వచ్చే ఆదాయం మొత్తం ఉద్యోగుల జీతాలకే సరిపోతోందని, శుక్రవారం వస్తే ఏ బ్యాంకు నుంచి ఏ ఫోన్‌ వస్తోందోనన్న భయం వేస్తోందని అన్నారు. 

బ్యాంకు వాళ్లు ఫోన్‌ చేసి మీ డ్యూ డేట్‌ వచ్చింది.. సోమవారంలోగా వడ్డీ కట్టాలని ఎక్కడ అడు గుతారోనన్న భయం వెంటాడుతోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో అతి ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయడానికి నిధులు వెచ్చిస్తున్నామన్నారు. జిల్లాకు ముఖ్యమైన హంద్రీ–నీవా కాలువను ఈ ఏడాది జూన్‌ 10 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. హంద్రీ–నీవా కాలువ సామర్థ్యం పెంచాలని 2014–19 మధ్యకాలంలో 40 శాతం పనులు పూర్తి చేశామన్నారు. హంద్రీ–నీవా విస్తరణకు రూ.3,800 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు.

నూతన జిల్లా జడ్జిగా భీమా రావు

నెల్లూరుకు శ్రీనివాస్‌ బదిలీ

అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఈ. భీమా రావు నియమితులయ్యారు. చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఆయనను జిల్లాకు బదిలీ చేశారు. ఇక్కడ ఉన్న జి. శ్రీనివాస్‌ నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. అలాగే, అనంతపురం నాలుగో అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి (గుత్తి)గా విధులు నిర్వహిస్తున్న శ్రీహరిని పిఠాపురం అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జిగా, అదనపు జిల్లా జడ్జి ఎం. శోభారాణిని సీబీఐ స్పెషల్‌ జడ్జి (కర్నూలు)గా బదిలీ చేశారు.

● ఈ.భీమారావు 1972లో పిఠాపురంలో జన్మించారు.బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ కాకినాడలో పూర్తి చేశారు. పిఠాపురంలో న్యాయవాద వృత్తిని చేపట్టారు. 2013లో అదనపు జిల్లా జడ్జిగా విజయవాడలో బాధ్యతలు చేపట్టారు. 2017లో ఫ్యామిలీ కోర్టుకు బదిలీ అయ్యారు. అదే సంవత్సరంలోనే విజయనగరం ఫ్యామిలీ కోర్టు కమ్‌– నాలుగో అదనపు జిల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. మొదటిసారి 2020లో పదోన్నతిపై పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

● నెల్లూరుకు బదిలీపై వెళ్తున్న జడ్జి జి. శ్రీనివాస్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా సంచలన తీర్పులు వెలువరించారు. కందుకూరు శివారెడ్డి హత్య కేసులో నిందితులకు రెండు జీవిత కాలాల కఠిన కారాగార శిక్ష విధించారు. జిల్లా కోర్టు చరిత్రలోనే మొత్తం 12 కేసుల్లో ముద్దాయిలకు జీవిత ఖైదు విధించిన తొలి ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్‌ కావడం గమనార్హం.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు 1
1/1

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement