కనగానపల్లి: ఉరుముల శబ్దాలు, పోతురాజుల నృత్య విన్యాసాలు, భక్తుల కోలాహలం మధ్య దాదులూరు పోతలయ్యస్వామి గావుల మహోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. స్వామి కాపులు, భక్తులు వేకువజామునే ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామి వారికి బోనాలు సమర్పించారు. అనంతరం ఉరుముల శబ్దాలకు అనుగుణంగా పోతురాజులు నృత్య విన్యాసాలు చేసుకుంటూ ఆలయంలోకి వచ్చారు. ఆలయ పూజార్లు పోత లయ్యస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల కోలాహలం మధ్య 11 మంది పోతురాజులు మేకపోతు పిల్లలను స్వామికి గావుల (బలి) మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులు ఆలయం ముందు పొట్టేళ్లు, మేకపోతులను బలి ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. పోతలయ్యస్వామి గావుల మహోత్సవాన్ని తిలకించేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావటంతో ఆలయ ఆవరణమంతా కిక్కిరిసిపోయింది.
వైభవం..గావుల మహోత్సవం


