
కంబదూరులో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ వినోద్‌కుమార్
కంబదూరు: జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి పెట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినోద్‌కుమార్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం ఆయన కంబదూరు సరిహద్దు చెక్ పోస్ట్‌ను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అక్రమ మద్యం, నగదు, డ్రగ్స్ వంటివి రవాణా జరగకుండా సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద నిఘా పటిష్టం చేస్తూ అరికట్టాలని సూచించారు. తర్వాత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియలో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై కలెక్టర్ ఆసహనం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల గోడలపై రాసిన ఫోన్ నంబర్లకు కలెక్టర్ ఫోన్ చేయగా తహసీల్దార్ స్పందించకపోవడంతో ఆగ్రహించారు. పోలింగ్ కేంద్రాల ఆవరణలో రాజకీయ నేతల పేర్లు కలిగిన శిలాఫలకాలు కనిపించే విధంగా ఉంచడంతో అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను అదేశించారు. కలెక్టర్ వెంట ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాణీ సుస్మిత, డీఎస్పీ బి.శ్రీనివాసులు, సీఐ నాగరాజు, తహసీల్దార్ నిత్యానంద బాబు, ఎంపీడీఓ సుధాకర్ రాజు, ఎస్‌ఐ ఆంజనేయులు తదితరులు ఉన్నారు.
స్వేచ్ఛగా ఓటు వినియోగించుకోండి
కళ్యాణదుర్గం: సాధారణ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వి.వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కళ్యాణదుర్గం పట్టణంలోని టీ సర్కిల్‌లో ఓటు హక్కుపై కలెక్టర్ అవగాహన కల్పించారు. అనంతరం టీ సర్కిల్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు పోలీసు కవాతులో పాల్గొన్నారు. 2019 ఎన్నికల కన్నా ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం మరింత పెరగాలన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటారు. కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంను తనిఖీ చేశారు. తర్వాత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (నార్తు)లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ రాణీ సుస్మిత, డీఎస్పీ బి.శ్రీనివాసులు, తహసీల్దార్ శుభకర్‌రావు, ఎంఈఓలు విజయకుమారి, బాబు, మున్సిపల్ కమిషనర్ నరసారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.
పకడ్బందీగా ఈవీఎంల ర్యాండమైజేషన్
అనంతపురం అర్బన్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈవీఎంలు, వీవీ ప్యాట్ల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్‌కుమార్ అన్నారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఈవీఎం మేనేజ్మెంట్ నోడల్ అధికారి, నగర పాలక కమిషనర్ మేఘ స్వరూప్, డీఆర్‌ఓ జి.రామకృష్ణారెడ్డితో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల, వీవీ ప్యాట్ల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. ముందుగా అనంతపురం పార్లమెంట్ నియోజవర్గ స్థానానికి, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎంలు, వీవీప్యాట్‌లు మొదటి ర్యాండమైజేషన్ చేపట్టారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎంలు, వీవీ ప్యాట్లు తరలించే వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఉంటుందన్నారు. సెక్యూరిటీ ప్రొటోకాల్ ప్రకారం పటిష్ట పోలీసు బందోబస్తుతో అసెంబ్లీ నియోజకవర్గాలకు వాటిని చేరవేస్తామన్నారు. సమావేశంలో ఏఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ రవికుమార్, ఎస్‌ఏ శామ్యూల్ బెంజిమన్, ఐటీ శివ పాల్గొన్నారు.
స్ట్రాంగ్‌రూం పరిశీలన
అనంతపురం: జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్ రూంలను ఎస్పీ అమిత్ బర్దర్ పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. పాత ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. అదే విధంగా శింగనమల, అనంతపురం అర్బన్, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను భద్రపరచిన ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, జూనియర్ కళాశాల, ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాలను సందర్శించారు. మెయిన్ స్ట్రాంగ్ రూంల నుంచి ఈవీఎంలను తరలించాక ఎలాంటి భద్రత కల్పించాలి.. స్ట్రాంగ్ రూంలకు ఎగ్జిట్, ఎంట్రెన్స్ పాయింట్లు ఎక్కడ పెడితే బాగుంటుందనే అంశంపై పలు సూచనలు చేశారు. నిరంతర బందోబస్తు చేపట్టే గార్డు పాయింటు సీసీ కెమెరాలు, తదితర అంశాలను సమీక్షించారు. ఎస్పీ వెంట ఏఆర్ అదనపు ఎస్పీ ఎస్.లక్ష్మీనారాయణరెడ్డి, డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి, త్రీటౌన్ ఎస్‌ఐ గోపాలుడు ఉన్నారు.