
అశేష భక్తజనం నడుమ సాగుతున్న రథోత్సవం (ఇన్‌సెట్) ప్రత్యేక అలంకరణలో ఆంజనేయస్వామి
రాయదుర్గం: డి హీరేహాళ్ మండలంలోని మురడిలో గురువారం ఆంజనేయస్వామి బ్రహ్మరథోత్సవం కనులపండువగా జరిగింది. స్వామికి వివిధ అభిషేకాలు, పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవ విగ్రహాన్ని అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య పల్లకీలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. పూలతో ప్రత్యేకంగా అలంకరించిన రథంలో అధిష్టింపజేశారు. ఈఓ నరసింహా రెడ్డి, గ్రామ పెద్దలు నారికేళాలు సమర్పించి ఉత్సవం ప్రారంభించారు. రథోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ‘హనుమా మము గనుమా’ అంటూ దివ్య స్వరూపుడి దర్శనం చేసుకుని తరించారు. రథం ముందు యువకులు నందికోలు నాట్యం, కోలాటం, చెక్కభజనలతో ఆకట్టుకున్నారు. వైఎస్సార్‌సీపీ రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి రథోత్సవంలో పాల్గొని స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రారెడ్డి, మార్కెట్‌యార్డ్ చైర్మన్ బోజరాజ్‌నాయక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
