గుత్తి: బతుకు తెరువు కోసం వలస వచ్చిన ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం గుత్తి రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడిని యూపీకి చెందిన మితిలేష్ కశ్యప్ (46)గా గుర్తించారు. మృతుడి వద్ద లభ్యమైన ఫోన్ నంబర్ ఆధారంగా కుటుంబసభ్యులు జీఆర్పీ ఎస్‌ఐ నాగప్ప ఫోన్ చేసి సమాచారం తెలిపారు. సెక్యూరిటీ గార్డు ఉద్యోగం చేయడానికి ఆంధ్రాకు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి రెండు రోజుల క్రితం బయల్దేరాడని వారు తెలిపారు. అయితే ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనే వివరాలు తెలియరాలేదు. సోమవారం ఉదయం ప్లాట్‌ఫాంపై సంచరిస్తున్న కశ్యప్... వెళుతున్న గూడ్స్ రైలు కిందకు ఉన్నఫళంగా దూకాడు. ఘటనలో అతని శరీరం రెండు ముక్కలైంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అంగన్‌వాడీ కేంద్రంలో చోరీ
కంబదూరు: మండలంలోని తిమ్మాపురం అంగన్‌వాడీ కేంద్రం–1లో ఆదివారం రాత్రి దుండగులు చొరబడి రెండు గ్యాస్ సిలిండర్లు, 1,151 కోడిగుడ్లను అపహరించుకెళుతూ కేంద్రానికి నిప్పు పెట్టారు. మంటల్లో రిజిస్టర్లు, ప్రీస్కూల్ పిల్లల సామగ్రి, బీరువాలు, బిందెలు, బకెట్లు కాలిపోయాయి. రూ.30 వేలకు పైగా నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న సీడీపీఓ వనజ అక్కమ్మ అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
రేపు కుందుర్పిలో ‘జగనన్నకు చెబుదాం’
కుందుర్పి: ‘జగనన్నకు చెబుదాం’ మండల స్థాయి కార్యక్రమం బుధవారం కుందుర్పిలో నిర్వహించనున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం పది గంటలకు జరిగే కార్యక్రమానికి కలెక్టర్ గౌతమితో పాటు జిల్లా ఉన్నతాధికారులు హాజరవుతారని తహసీల్దార్ విజయకుమారి, ఎంపీడీఓ లక్ష్మీనరసింహ తెలిపారు. మండల ప్రజలు సమస్యలు ఏవైనా ఉంటే అర్జీల రూపంలో కలెక్టర్ దృష్టికి తీసుకురావొచ్చని తెలిపారు.