వ్యక్తి దారుణహత్య | Sakshi
Sakshi News home page

వ్యక్తి దారుణహత్య

Published Wed, Nov 29 2023 1:50 AM

హతుడు నాగార్జున - Sakshi

యల్లనూరు: భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న పరస్పర దాడుల్లో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... యల్లనూరు మండలం మేడికుర్తికి చెందిన నాగార్జున, నిట్టూరు నివాసి ఆర్‌.వెంకటరెడ్డికి ఆయా గ్రామాల సరిహద్దున పొలాలు ఉన్నాయి. ఆ పొలాల మధ్య గట్టు విషయంగా ఇద్దరి మధ్య వివాదం నడుస్తోంది. గట్టు మాదంటే మాదంటూ ఇద్దరూ తరచూ ఘర్షణ పడేవారు. ఈ క్రమంలో భూ సర్వే చేయించారు. సర్వే అనంతరం నిర్దేశించిన హద్దుల్లో మంగళవారం ఉదయం వెంకటరెడ్డి స్తంభాలను పూడుస్తుంటే అక్కడే ఉన్న నాగార్జున, అతని చిన్నాన్న కంబగిరి అడ్డుకున్నారు. ఆ సమయంలో గొడవ తారాస్థాయికి చేరుకుంది. వెంకటరెడ్డి, ఆయన కుమారుడు పెద్దిరెడ్డి గడ్డపారతో నాగార్జున (36) తలపై బాదడంతో తీవ్ర రక్తస్రావమైంది. కుటుంబసభ్యులు వెంటనే తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక నాగార్జున మృతి చెందాడు. ఇదే ఘటనలో గాయపడిన కంబగిరి చికిత్స పొందుతున్నాడు. హతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆటో బోల్తా – ఒకరి మృతి

బ్రహ్మసముద్రం : ఆటో బోల్తాపడిన ఘటనలో ఓ మహిళా కూలీ మృతి చెందింది. మరో ఏడుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. గుమ్మఘట్ట మండలం ఎర్రంపల్లి, బ్రహ్మసముద్రం మండలం గుడిపల్లి గ్రామాల నుంచి బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లికి వ్యవసాయ పనుల కోసం కూలీలు మంగళవారం ఉదయం ఓ ఆటోలో బయల్దేరారు. కన్నేపల్లి సమీపంలోకి చేరుకోగానే రాంగ్‌ రూట్‌లో వేగంగా దూసుకొచ్చిన ద్విచక్ర వాహనదారుడిని తప్పించే క్రమంలో ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఆటోలో ప్రయాణిస్తున్న గుమ్మఘట్ట మండలం ఎర్రంపల్లికి చెందిన జయలక్ష్మి, పుష్పావతి, సరోజమ్మ, గంగమ్మ, శాంతమ్మ, బ్రహ్మసముద్రం మండలం గుడిపల్లికి చెందిన కదిరక్క, చిత్రావతి, ముద్దలాపురం నివాసి ఆటో డ్రైవర్‌ తిమ్మప్ప తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను 108 అంబులెన్స్‌ ద్వారా కళ్యాణదుర్గంలోని సీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో జయలక్ష్మి (43)ని అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక మంగళవారం మధ్యాహ్నం ఆమె మృతి చెందింది. విషయం తెలుసుకున్న మంత్రి ఉషశ్రీచరణ్‌ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆమె వ్యక్తిగత సహాయకుడు దేవదాసు ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.

వ్యక్తి దుర్మరణం

గార్లదిన్నె: విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గార్లదిన్నె మండలం కేశవాపురానికి చెందిన నాగేంద్ర (38), కల్లూరులో హోటల్‌ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి గార్లదిన్నె నుంచి ద్విచక్ర వాహనంపై వెళుతూ కల్లూరు వద్ద 44వ జాతీయ రహదారిపై అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద యూటర్న్‌ తీసుకునే క్రమంలో నేరుగా వెళ్లి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య పద్మావతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

కుక్కల దాడిలో చిన్నారికి గాయాలు

గుంతకల్లు టౌన్‌: కుక్కల దాడిలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన మేరకు... గుంతకల్లులోని అల్లీపీరా కాలనీకి చెందిన షేక్‌ నూర్‌ మహమ్మద్‌, నస్రీన్‌ దంపతుల మూడేళ్ల వయసున్న కుమార్తె అప్రోజ్‌... ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో నర్సరీ చదువుతోంది. సోమవారం మధ్యాహ్నం తల్లి స్కూల్‌ వద్దకెళ్లి కుమార్తెను పిలుచుకుని ఇంటికి వెళుతుండగా చిన్నారిపై వీధి కుక్క దాడి చేసింది. స్థానికులు వెంటనే కుక్క బారి నుంచి తల్లీబిడ్డను కాపాడి ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వీధుల్లో కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ అధికారులకు ఈ సందర్భంగా ఆ వార్డు కౌన్సిలర్‌ మహాలక్ష్మి విన్నవించారు.

గాయపడిన అప్రోజ్‌
1/1

గాయపడిన అప్రోజ్‌

Advertisement
 
Advertisement