
జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులర్పించిన కలెక్టర్ గౌతమి తదితరులు
అనంతపురం సిటీ: సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే చొరవతోనే మహిళల జీవితాల్లో వెలుగులు వచ్చాయని కలెక్టర్ గౌతమి అన్నారు. మహిళలకూ విద్య అవసరమని గుర్తించి, పోరాడిన మహాను భావుడు పూలే అని కొనియాడారు. జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కుష్బూ కొఠారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలోని పూలే విగ్రహానికి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ గౌతమి, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు. వీరితో పాటు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్ అహమ్మద్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ మేడా రామలక్ష్మి, నగర మేయర్ వసీం, ఆర్టీసీ జోనల్ చైర్‌పర్సన్ మంజుల, ఏడీసీసీ బ్యాంక్ చైర్‌పర్సన్ లిఖిత, అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, వాసంతి పూలే విగ్రహానికి, చిత్రపటానికి వేర్వేరుగా నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే మహిళల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేయడమే గాక తొలిసారి తన భార్యతోనే అక్షరాభ్యాసం మొదలుపెట్టడం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిందన్నారు. ఆయన చొరవతోనే నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణించగలుగుతున్నారన్నారు. ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా చేసుకొని నిస్వార్థ జీవితాన్ని గడిపిన జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుద్దామని పిలుపునిచ్చారు. జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ సమాన హక్కులతో పాటు కుల వ్యవస్థ నిర్మూలనకు, అట్టడుగు వర్గాల విద్యాభివృద్ధికి పాటుపడి అందరికీ ఆదర్శప్రాయుడిగా పూలే నిలిచిపోయారని కొనియాడారు. పూలే స్ఫూర్తితో సీఎం వైఎస్ జగన్ కూడా విద్య, వైద్యం, మహిళా సాధికారతకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ లలితా బాయి, ఐసీడీఎస్ పీడీ డాక్టర్ బీఎన్ శ్రీదేవి, బీసీ కార్పొరేషన్ ఈడీ సుబ్రహ్మణ్యం, ఏడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ పామిడి వీరా, పార్టీ అనుబంధం మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లా బేగ్, వక్ఫ్‌బోర్డు చైర్మన్ రిజ్వాన్, మహిళా విభాగం ప్రతినిధులు కృష్ణవేణి, శ్రీదేవి, రాధ, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.