గర్భిణులకు సీమంతం చేస్తున్న కలెక్టర్ గౌతమి
అనంతపురం సెంట్రల్: ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని గర్భిణులకు కలెక్టర్ గౌతమి పిలుపునిచ్చారు. అనంతపురంలోని రెవెన్యూభవన్‌లో ఐసీడీఎస్, సాయి స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన సామూహిక సీమంతాల కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. ఆరోగ్యంగా ఉంటే ఇల్లు కూడా ఆనందంగా ఉంటుందన్నారు. ఈ ఏడాదిని అంతర్జాతీయ చిరుదాన్యాల దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని, ఈ క్రమంలో చిరుధాన్యాల సాగుకు అనుకూలమైన జిల్లాలో ఆ దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. పోషకాహారం, దాని ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని ఐసీడీఎస్ సిబ్బందిని కోరారు. బాల్య వివాహాలు అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదేశించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లి తల్లులతో మాట్లాడాలి బాల్య వివాహాల అడ్డుకట్టకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం 26 మంది గర్బిణులకు సీమంతం చేశారు. రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం నుంచి తీసుకొచ్చిన పోషకాహారం న్యూట్రిషన్ ప్లాంట్స్‌ను కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. చిరుధాన్యాల వంటలతో అంగన్‌వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో నిర్వాహకులు విజయసాయి, ఐసీడీఎస్ ఇన్‌చార్జ్ పీడీ శ్రీదేవి, సోషల్ వెల్ఫేర్ జేడీ మధుసూదన్‌రావు, బీసీ వెల్ఫేర్ డీడీ కుష్బూకొఠారి, డీటీడబ్ల్యూ అన్నాదొర, మెప్మా పీడీ విజయలక్ష్మి, వ్యవసాయశాఖ ఏడీఏ శైలజ, కేవీకే శాస్త్రవేత్త సుధారాణి, సీడీపీఓలు, నోడల్ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ గౌతమి


