హిందూపురంలో వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్న భక్తజనం
ఉత్సాహం ఉరకలేసింది. విఘ్నవినాయకుడి నామస్మరణ మార్మోగింది. సర్వమత సామరస్యం వెల్లివిరిసింది. కొలువుదీరినప్పటి నుంచి విశేష పూజలందుకున్న లంబోదరుడు ప్రశాంత వాతావరణంలో గంగమ్మ ఒడికి చేరాడు. బొజ్జగణపయ్య నిమజ్జనోత్సవం ఆదివారం శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో అంగరంగ వైభవంగా జరిగింది. పట్టణంలో వాడవాడలా కొలువుదీరిన గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ట్రాక్టర్లు, ప్రత్యేక వాహనాల్లో నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా యువత ఆధ్యాత్మిక సాగరంలో మునిగిపోయారు. వాహనాల ముందు డీజే పాటలకు ఉల్లాసంగా డ్యాన్సులు చేస్తూ ముందుకు కదిలారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ తన్మయత్వంతో హోరెత్తించారు. బాణ సంచా పేలుళ్ల నడుమ రంగులు చల్లుకుని సందడి చేశారు.
భారీ క్రేన్‌లతో నిమజ్జనం
గతేడాది కంటే ఈసారి భారీ వినాయకుడి విగ్రహాలు కొలువుదీరాయి. 20 అడుగులకు పైగా ఉన్న విగ్రహాలు 30 వరకూ ఏర్పాటు చేశారు. దీంతో వాటి నిమజ్జనానికి గుడ్డం కోనేరు వద్ద క్రేన్‌లు ఏర్పాటు చేశారు. అగ్నిమాపక, మున్సిపల్, పోలీసు సిబ్బంది సమన్వయంతో విగ్రహాలను ప్రశాంత వాతావరణంలో గంగమ్మ ఒడికి చేర్చారు.
– సాక్షి బృందం
హిందూపురంలో ఉల్లాసంగా
గణేశ్ నిమజ్జనోత్సవం
ఊరేగింపులో భారీ వినాయక విగ్రహాలు
గంగ ఒడికి చేరిన గణనాథుడు


