కంబదూరుకు చెందిన ఓబయ్య.. | Sakshi
Sakshi News home page

కంబదూరుకు చెందిన ఓబయ్య..

Published Tue, Aug 15 2023 1:38 AM

- - Sakshi

కళ్యాణదుర్గం: కంబదూరుకు చెందిన ఓబయ్య.. అదే గ్రామంలోని పాఠశాలలో విద్యాభ్యాసం ప్రారంభించి 1937లో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించారు. అంటరానితనానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కంబదూరులో 70 మంది హరిజనులను సమీకరించి పాఠశాలను ప్రారంభించారు. ఈ క్రమంలోనే నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డి, ఐదుకల్లు సదాశివన్‌, పెడబల్లి చిదంబరరెడ్డి, విద్వాన్‌ విశ్వం, గుత్తి రామకృష్ణ తదితరులతో కలసి స్వాతంత్య్ర ఉద్యమంలోకి కాలు పెట్టారు. అప్పట్లో బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓబయ్య చేసిన ప్రసంగాలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి.

వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు ఓబయ్య టీచర్‌ సర్టిఫికెట్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. 1942లో బ్రిటీష్‌ ప్రభుత్వం అణచివేత ఎక్కువ కావడంతో కాంగ్రెస్‌ హై కమాండ్‌ ఆదేశాలతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అదే ఏడాది ఆగస్టు 25న ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారంటూ ఓబయ్యను బ్రిటీష్‌ ప్రభుత్వం అరెస్ట్‌ చేసి, అనంతపురం సబ్‌జైలుకు తరలించింది. క్షమాపణకు ఓబయ్య నిరాకరించడంతో బళ్లారి సబ్‌జైలుకు తరలించారు. స్వాతంత్య్ర వచ్చిన తర్వాత 1972–78 మధ్య కాలంలో ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రంలో ఓబయ్య ఎమ్మెల్సీగా ప్రజాసేవ చేశారు. అంతకు ముందు ఆర్డీఓ అధ్యక్షతన సమితి ఉపాధ్యక్షుడిగా, కంబదూరు సమితి అధ్యక్షుడిగా పనిచేశారు.

నరసింహమై గర్జించాడు
అనంతపురం కల్చరల్‌: ‘క్షమాపణ చెప్పు నిన్ను వదిలేస్తాం. లేదంటే 27 కొరడా దెబ్బలు, ఆరు నెలల కఠిన కారాగార శిక్ష తప్పదు’ అని తీవ్రంగా హెచ్చరించిన పోలీసుల ముందు ఆత్మగౌరవాన్ని ప్రదర్శించిన కాటప్పగారి నరసింహారెడ్డిది అనంతపురం రూరల్‌ మండలం పూలకుంట గ్రామం. 1921 జని్మంచిన ఆయన మదనపల్లిలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ చదువుకుంటున్న రోజుల్లో మహాత్ముడి ప్రసంగాలతో చైతన్యం పొంది స్వాతంత్య్ర ఉద్యమాల్లో పాల్గొంటూ వచ్చారు. బ్రిటీష్‌ పాలకులకు కొరకరాని కొయ్యగా మారారు. తమ గ్రామంలో హరిజన వాడకు 7 ఎకరాల సొంత భూమిని దానంగా ఇచ్చారు. ప్రాథమిక వైద్య కేంద్రం, పాఠశాలకు భూములు దానమివ్వడమే కాకుండా అనేక ఆలయాలకు సొంత భూమిని విరాళంగా అందజేశారు. 

గాందీజీ మాటే శిరోధార్యంగా
రాయదుర్గం టౌన్‌:  గాం«దీజీ మాటే శిరోధార్యంగా స్వాతంత్య్ర ఉద్యమంలో రాయదుర్గం వాసులు ప్రధాన భూమికను పోషించారు.  వరదా చెన్నప్ప, తిప్పయ్య, గురుమాల్‌ నాగభూషణం, డాక్టర్‌ ఆర్‌.నాగన్నగౌడ్,  ఓబుళాచార్యులు, కెరె శరణప్ప, ఎన్‌సీ శేషాద్రి, జగన్నాథసింగ్, నిప్పాణి రంగరావు, వై.హెచ్‌.సుబ్బారావు, వై.హెచ్‌.సత్యభామాదేవి, మోపూరు చంద్రకాంతనాయుడు, నాగిరెడ్డిపల్లి నివాసి కట్టరావుప్ప.. తదితరులు స్వాతంత్య్రోద్యమంలో పాలు పంచుకున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో అరెస్ట్‌ అయి మూడు నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో రాయదుర్గం నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యేగా గురుమాల్‌ నాగభూషణం పనిచేశారు.   త్యాగధనుల గుర్తుగా 74 ఉడేగోళంలో స్మారక స్తూపాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

ఉద్యమకారుల ఆకలి తీర్చి 
రాయదుర్గం: జాతిపిత మహాత్మా గాంధీ బాటలో నడిచి గుమ్మఘట్ట మండలం సిరిగేదొడ్డికి చెందిన దామోదర్‌సింగ్‌ జైలు జీవితం అనుభవించారు. 1918లో జని్మంచిన ఆయన 1942లో క్విట్‌ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం అనుభవించారు. వంటలు చేయడంలో సిద్ధహస్తుడైన ఆయన రుచికరమైన ఆహార పదార్థాలు చేసి ఉద్యమకారుల ఆకలి తీర్చేవారు. 2000వ సంవత్సరంలో ఆదోని వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. 

పోరాటం విలక్షణం 
అనంతపురం కల్చరల్‌: అనంత స్వాతంత్య్ర సమరయోధుల్లో చిరస్మరణీయ పాత్ర పోషించిన వారిలో వేములేటి ఆదిరానాయణరెడ్డి ఒకరు.  శ్రీసత్యసాయి జిల్లా గుట్టూరు మండలం చిన్నప్పరెడ్డి పల్లిలో జని్మంచిన ఆయన కొత్తచెరువు మండలం లోచర్లలో స్థిరపడ్డారు. బాల్యంలో పెనుకొండలో విద్యనభ్యసించే సమయంలోనే కమ్యూనిస్టు పార్టీ తరఫున అనేక సత్యాగ్రహాలు, ఉద్యమాల్లో పాలుపంచుకున్నారు. తర్వాతి రోజుల్లో బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా  పూర్తి స్థాయి స్వాతంత్య్ర ఉద్యమంలోకి కాలు పెట్టారు. 1941లో పోలీసులు అరెస్ట్‌ చేసి బళ్లారి సెంట్రల్‌ జైలుకు తరలించారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement