కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

Jun 12 2023 11:06 AM | Updated on Jun 13 2023 11:09 AM

- - Sakshi

అనంతపురం శ్రీకంఠంసర్కిల్‌: ఆన్‌లైన్‌ గేమ్‌లకు బానిసైన ఓ ఏఆర్‌ కానిస్టేబుల్‌ సర్వమూ కోల్పోయి అప్పుల పాలయ్యాడు. చివరకు అప్పులు తీర్చే మార్గం కానరాక ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలు.. నార్పలకు చెందిన అనిల్‌కుమార్‌ శ్రీసత్యసాయి జిల్లాలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

సకాలంలో కుటుంబసభ్యులు అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది. కాగా, సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆశతో అనిల్‌ కుమార్‌ ఆన్‌లైన్‌ గేమ్‌లకు బానిసైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో తెలిసిన వారితో అప్పులు చేస్తూ వచ్చాడు. అవి కాస్త వడ్డీలకు వడ్డీలు పేరుకుపోయి పెనుభారంగా మారాయి. కానిస్టేబుల్‌ అనే ఒకేఒక్క కారణంతో వడ్డీ వ్యాపారులు సైతం మిన్నకుండిపోయారు.

చివరకు అప్పు తీర్చాలంటూ కొంత కాలంగా వడ్డీ వ్యాపారుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. పరిస్థితి చెయ్యి దాటిపోతుండడంతో అప్పులు తీర్చే మార్గం కానరాక చివరకు ఆత్మహత్యాయత్నం చేసినట్లు నార్పల పోలీసులకు బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement