తొలి విడత ‘పల్లె పోరు’ ప్రచార పర్వానికి మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు తెరపడింది. మైకులు మూగబోయాయి.. ప్రచార రథాలు నిలిచిపోయాయి. కానీ గ్రామాల్లో రాజకీయ వేడి మాత్రం చల్లారలేదు. గురువారం జరగనున్న తొలి విడత పంచాయతీ ఎన్నికలు కేవలం సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎంపికకే | - | Sakshi
Sakshi News home page

తొలి విడత ‘పల్లె పోరు’ ప్రచార పర్వానికి మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు తెరపడింది. మైకులు మూగబోయాయి.. ప్రచార రథాలు నిలిచిపోయాయి. కానీ గ్రామాల్లో రాజకీయ వేడి మాత్రం చల్లారలేదు. గురువారం జరగనున్న తొలి విడత పంచాయతీ ఎన్నికలు కేవలం సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎంపికకే

Nov 25 2026 2:24 AM | Updated on Nov 25 2026 2:24 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరిగే 13 మండలాల్లో పోటీ రసవత్తరంగా మారింది. అనంతపురం రూరల్‌, ఆత్మకూరు, రాప్తాడు, బొమ్మనహాళ్‌, బ్రహ్మసముద్రం, డి.హీరేహాళ్‌, గుమ్మఘట్ట, కళ్యాణదుర్గం, కంబదూరు, కణేకల్లు, కుందుర్పి, రాయదుర్గం, శెట్టూరు మండలాల్లో ఎన్నికల సందడి నెలకొంది. మొత్తం 218 సర్పంచ్‌ స్థానాలు, 2,217 వార్డు స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదల కాగా, 8 సర్పంచ్‌, 482 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 210 సర్పంచ్‌, 1,735 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్‌ పదవులకు 539 మంది, వార్డు స్థానాలకు 3,786 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తంగా 4,325 మంది అభ్యర్థుల రాజకీయ భవితవ్యం ఓటరు చేతిలో ఉంది.

తెరవెనుక వ్యూహాలకు కీలక సమయం

ఎన్నికల ప్రచారంలో కనిపించిన హడావుడి ఒక ఎత్తయితే.. పోలింగ్‌కు ముందు నిశ్శబ్దంగా జరిగే రాజకీయ పరిణామాలు మరో ఎత్తు. ప్రత్యర్థి శిబిరాల్లోని అసంతృప్తులను తమవైపు తిప్పుకోవడం, ఓటర్ల మద్దతును కూడగట్టడం, చివరి నిమిషంలో సమీకరణాలను మార్చే ప్రయత్నాలు చేయడం వంటి పరిణామాలపై గ్రామాల్లో చర్చ సాగుతోంది. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు అధికార బలాన్ని ఉపయోగించి ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న ఆరోపణలు, అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఓటరుకు స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించడమే ప్రజాస్వామ్యానికి అసలైన రక్షణ.

పోలింగ్‌ కేంద్రాలే అసలైన పరీక్షా వేదికలు

గతంలో జరిగిన మున్సిపల్‌, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న వివాదాలు, ఆరోపణలను గ్రామీణ ఓటర్లు గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్‌, కౌంటింగ్‌ కేంద్రాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా ప్రత్యర్థి వర్గాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. పోలింగ్‌ సిబ్బందిపై ఒత్తిళ్లు, ఓటర్లను భయపెట్టే ప్రయత్నాలు, కౌంటింగ్‌ సమయంలో వివాదాలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలి. ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.

అందరి చూపు కలెక్టర్‌, ఎస్పీ తీరుపైనే

పోలింగ్‌ సిబ్బంది బుధవారం నుంచే విధుల్లో నిమగ్నం కానున్నారు. ఇప్పటికే పీఓలకు శిక్షణ పూర్తయింది. గురువారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ స్వల్ప వ్యవధిలో ఎన్నికల యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించడం అత్యంత కీలకం. ఎక్కడైనా గొడవలు, బెదిరింపులు, అక్రమాలకు ప్రయత్నాలు జరిగితే వెంటనే అడ్డుకోవాలి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌, ఎస్పీ తీసుకునే చర్యలపైనే ఇప్పుడు అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరగాల్సిన ప్రజాస్వామ్య ప్రక్రియ. గ్రామానికి సేవ చేసే నాయకుడిని ఎన్నుకునే అవకాశం ప్రజలకు దక్కాలి. అధికారం, అంగబలం, అర్థబలం కాదు.. ప్రజాబలమే గెలవాలి. చివరకు పల్లె ఓటరు ఇచ్చే తీర్పు ఎంతటి రాజకీయ వ్యూహాలనైనా తలకిందులు చేయగలదన్నది ఈ ఎన్నికల్లో ఆసక్తికరమైన అంశం.

ముగిసిన ప్రచార పర్వం

తొలివిడత పంచాయతీల్లో 24 గంటల్లో అసలు పరీక్ష

రేపు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌...మధ్యాహ్నం 2 నుంచి కౌంటింగ్‌

210 సర్పంచ్‌ స్థానాలు.. 1,835 వార్డుల్లో హోరాహోరీ

4,325 మంది అభ్యర్థుల భవితవ్యం ఓటరు చేతిలోనే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement