ఆ బాలికపై విధి కన్నెర్ర చేసింది. పచ్చటి జీవితాన్ని పచ్చకామెర్ల రూపంలో కాటేసింది. తోటి విద్యార్థులతో కలిసి ఆడుతూపాడుతూ చదువుకోవాల్సిన ఆ బాలికను ఆస్పత్రికే పరిమితం చేసింది. కళ్లముందే కన్నబిడ్డ కాలేయ వ్యాధితో నరకం అనుభవిస్తుంటే కన్నపేగు తల్లడిల్లిపోతోంది. కబళిస్తున్న కాలేయ వ్యాధితో పాప ఆరోగ్యం క్షీణిస్తుంటే తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కాలేయ మార్పిడితోనే తమ బిడ్డ బతికే అవకాశముందని, దయగల మారాజులు సాయం చేసి తమ బిడ్డకు పునర్జన్మను ప్రసాదించాలని వేడుకుంటున్నారు.
● బాలికను కబళిస్తున్న కాలేయ వ్యాధి
● కాలేయ మార్పిడికి తప్పనిసరి
● ఆపన్నహస్తం అందించాలని.. తల్లిదండ్రుల కన్నీటి వేడుకోలు
గుంతకల్లు టౌన్: పట్టణంలోని గంగానగర్‌కు చెందిన ఆర్.లక్ష్మి, చలపతి దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. పేద కుటుంబానికి చెందిన చలపతి డీఎస్పీ ఆఫీసు రోడ్‌లో చిన్న అద్దాల అంగడి(ఇంటీరియర్ గ్లాస్ కట్టింగ్ షాపు) నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. పిల్లలిద్దరినీ అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆ తల్లిదండ్రులను విధి చిన్నచూపు చూసింది. పాతగుంతకల్లులోని డాక్టర్ ఆర్‌పీ మున్సిపల్ హైస్కూల్‌లో టెన్త్‌క్లాస్ చదువుతున్న కుమార్తె లావణ్య కాలేయ వ్యాధితో మంచం పట్టింది. దీపావళి పండుగ మరుసటి రోజున స్కూల్‌కు వెళ్లొచ్చిన లావణ్య తన కళ్లు పచ్చగా ఉన్నట్లు తన స్నేహితులంతా చెబుతున్నారని తన తండ్రికి తెలియజేసింది. వెంటనే ఆ బాలికను స్థానికంగా ఉన్న వైద్యుడిని సంప్రదించగా వైద్యపరీక్షల నివేదిక ద్వారా కామెర్లు అధికంగా ఉన్నాయని తేలింది. వెంటనే సంబంధిత వ్యాధి నిపుణులను కలవాలని వైద్యుడు అనంతపురం రెఫర్ చేశారు. అక్కడ బాలికను పరిశీలించి లివర్‌కు సంబంధించి వైద్యపరీక్షలు చేయించిన డాక్టర్లు బాలికకు తప్పనిసరిగా కాలేయ మార్పిడి చేయించాలని సూచించారు. దీంతో హుటాహుటిన బెంగళూరులోని సెయింట్ జాన్స్ ఆస్పత్రికి తరలించారు. గత ఎనిమిది రోజులుగా లావణ్య చావుబతుకుల మధ్య పోరాడుతోంది.
కాలేయమార్పిడికి రూ.40 లక్షల వరకు ఖర్చు..
లావణ్యకు తప్పనిసరిగా కాలేయమార్పిడి చేయాలని వైద్యులు సూచించిన నేపథ్యంలో తమ కాలేయంలో కొంత భాగాన్ని దానం చేస్తామని తల్లిదండ్రులు వైద్యుల్ని కోరారు. అయితే వయస్సు అధికంగా ఉండటంతో వారి కాలేయం సరిపోదని చెప్పారు. ఈ నేపథ్యంలో సెయింట్ జాన్స్ ఆస్పత్రి వైద్యులు బెంగుళూరులోని ఐజీఓటీ, ఆర్గాన్ అండ్ టీష్యూ టాన్స్‌ఫ్లాంటేషన్ ఆర్గనైజేషన్‌కు విన్నవించారు. బాలికకు సరిపోయే 20–40 మధ్య వయస్సు కలిగిన వారి కాలేయ భాగం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే కాలేయ మార్పిడితో పాటు ఆస్పత్రి, మందుల ఖర్చుకు మొత్తం రూ.30 నుంచి 40 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు ప్రాథమికంగా తెలియజేశారు.
పాప పరిస్థితి దినదిన గండమే..
లావణ్య కాలేయం పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో వారం రోజులుగా పాప ఆస్పత్రి బెడ్‌పై నరకాన్ని అనుభవిస్తోంది. ప్లేట్‌లేట్స్, రక్తం(హిమోగ్లోబిన్) తగ్గడంతో కామెర్లు పెరిగి బాలిక కోమాలోకి వెళ్తోంది. కాలేయం రక్తంలోని విషపదార్థాలు (టాక్సిన్స్) శుభ్రపరిచే సామర్థ్యాన్ని కోల్పోవడంతో సదరు బాలికకు లివర్ డయాలసిస్, ప్లాస్మా మార్పిడి వంటి అధునాతన పద్దతులను ఉపయోగించిన సమయంలో పాప కళ్లు తెరిచి మాట్లాడుతుందని, మరికొద్దిసేపటికే తిరిగి కోమాలోకి వెళ్తుందని, ఇలాంటి కష్టం ఏ బిడ్డకు రాకూడదని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
మనస్సున్న మారాజుల్లారా స్పందించండి..
పదహారేళ్ల వయస్సులోనే మా బిడ్డ కాలేయ వ్యాధితో పోరాడుతోంది. వైద్యఖర్చులు మా శక్తికి మించి ఉన్నాయని, మానవత్వంతో స్పందించి తమ బిడ్డను బతికించాలని బాలిక తల్లిదండ్రులు లక్ష్మి, చలపతి వేడుకుంటున్నారు. మీరు చేసే చిన్న సాయమే తమ బిడ్డకు పునర్జన్మనిస్తుందని ప్రాధేయపడుతున్నారు. సాయం చేయదలచుకున్న వారు బాలిక తండ్రి బ్యాంకు ఖాతాకు తోచినంత డబ్బును పంపాలని కోరుతున్నారు.
బాలికతండ్రి చలపతి బ్యాంకు ఖాతా వివరాలు
పేరు: రాప్తాడు చలపతి
అకౌంట్ నం: 20247306675
ఐఎఫ్‌ఎస్ కోడ్ : ఎస్‌బీఐఎన్0013021
ఎస్‌బీఐ బజార్ బ్రాంచ్, గుంతకల్లు.
ఫోన్‌పే నం: 95737 65239
90635 74239


