సాక్షి ప్రతినిధి, అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసు యంత్రాంగం అధికార కూటమికి దాసోహమైంది. టీడీపీ నాయకులు చెప్పిందే వేదంలా డూడూ బసవన్నలా తలూపుతున్నారు. రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వారే అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుండడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే వారిని పోలీస్ స్టేషన్లకు పిలిపించి నామినేషన్లు విత్ డ్రా చేసుకోకుంటే తీవ్రంగా ఇబ్బంది పడతారంటూ పోలీసులే బెదిరిస్తుండడం విస్మయానికి గురిచేస్తోంది.
పయ్యావుల అండతో
రెచ్చిపోతున్న పోలీసులు
ఉరవకొండ నియోజకవర్గంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అండ చూసుకుని పోలీసులు రెచ్చిపోతున్నారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సాగిన పోలీసుల పక్షపాత ధోరణి పంచాయతీ పోరులోనూ పునరావృతమవుతోంది. ప్రతిపక్ష పార్టీల మద్దతుదారు అభ్యర్థులకు స్వయంగా ఫోన్లు చేస్తూ ‘నామినేషన్లు వేయొద్దు, ఎవరి బలవవంతం మీదో వేసి ఉంటే.. వాటిని వచ్చి విత్ డ్రా చేసుకోండి. మీ ప్రభుత్వం లేదు. పోటీ చేసి ఎందుకు ఇబ్బందులు పడుతారు? అధికార పార్టీ వారితో రాజీ చేసుకోండి’ అంటూ మధ్యవర్తుల్లా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు టీడీపీ నేతలు బరితెగించి, దమనకాండకు పాల్పడుతున్నా పోలీసులు వేడుక చూస్తున్నారు.
స్క్రూటినీలో కుట్రలు, కుతంత్రాలు
ఉరవకొండ మేజర్ పంచాయతీకి వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు నామినేషన్లు దాఖలు చేశారు. స్క్రూటినీ సమయంలో అధికారులు అడ్డదిడ్డంగా వ్యవహిరించారు. టీడీపీ నేతలు కేశవానంద, భగవాన్ రిటర్నింగ్ అధికారిపై ఒత్తడి తెచ్చి 5, 9, 14 వార్డులకు వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరింపజేశారు. టీడీపీ నేతల సమక్షంలోనే ఎన్నికల అధికారులు, పోలీసులు దగ్గరుండి ఈ తతంగం పూర్తి చేయడం గమనార్హం. వైఎస్సార్‌సీపీకి పట్టున్న నెరిమెట్ల పంచాయతీ సర్పంచ్ స్థానానికి శ్రీవాణి, అనుసూయమ్మ నామినేషన్లు వేశారు. అర్బన్ సీఐ మహానంది అధికారులపై ఒత్తడి తెచ్చి వీరి నామినేషన్లను రిజెక్ట్ చేయించారు. అలాగే బెళుగుప్ప, రమనేపల్లి, నర్సాపురం, ఆమిద్యాలలోనూ వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. వజ్రకరూరు మండలం పాతకడమలకుంట పంచాయతీ సర్పంచ్ స్థానానికి వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల రెండు నామినేషన్లను టీడీపీ నాయకుల ఒత్తిళ్ల మేరకు అధికారులు ఆస్తి వివరాలు సరిగా పొందుపరచలేదనే సాకుతో తిరస్కరించారు. దీంతో ఆ స్థానం టీడీపీ బలపరిచిన అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమం చేశారు.
● మంత్రి కేశవ్ ఆదేశాల మేరకు టీడీపీ నేతలు నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ 10 పంచాయతీలను ఏకగ్రీవం చేసుకోవాలనే లక్ష్యంతో ప్రత్యర్థి పార్టీ మద్దతుదారులపై బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడినట్లు సమాచారం.
పోలీసుల ‘పచ్చ’పాతం
మంత్రి పయ్యావుల కేశవ్ డైరెక్షన్‌లోనే పోలీసులు నడుచుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులను టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఉరవకొండ అర్బన్ సీఐ మహానంది, కూడేరు సీఐ రాజు, బెళుగుప్ప ఎస్‌ఐ శివ ‘స్వామి భక్తి’ ప్రదర్శిస్తున్నారు. కూడేరు సీఐ రాజు ఎంపీటీసీ ఎన్నికల్లో మరుట్ల–2లో టీడీపీ ఏజెంట్‌గా వ్యవహరించి దగ్గరుండి రిగ్గింగ్ చేయించిన విషయం తెలిసిందే. బైండోవర్ పేరుతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేస్తూ టీడీపీకి కొమ్ముకాస్తున్నారు. బెళుగుప్ప ఎస్‌ఐ శివ టీడీపీ ఏజెంట్‌గా మారి గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులను బెదిరించి టీడీపీ మద్దతుదారులు ఏకగ్రీవం అయ్యేలా చేస్తుండడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. విడపనకల్లు మండలం వేల్పుమడుగు సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసేందుకు వెళుతున్న వైఎస్సార్‌సీపీ మద్దతుదారు శ్రీరాములును ఎస్‌ఐ ఖాజాహుస్సేన్ బలవంతంగా పోలీస్ జీపులో ఎక్కించుకుని వెళ్లిపోవడం సంచలనంగా మారింది. సర్పంచ్ స్థానాన్ని టీడీపీ మద్దతుదారుకు ఏకగ్రీవంగా కట్టబెట్టేందుకు ఎస్‌ఐ దుస్సాహసానికి ఒడిగట్టారు.
అధికార పక్షానికి పోలీసుల దాసోహం
ఉరవకొండలో ఏకపక్షంగా విధుల నిర్వహణ
కూటమి నాయకులు చెప్పిందే వారికి వేదం
వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై బెదిరింపులు
బలవంతంగా నామినేషన్లు విత్‌డ్రా చేయిస్తున్న వైనం


