యల్లనూరు(పుట్లూరు): వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను కలవడానికి వెళ్తున్న తనను అడ్డుకోవడం కాదని, పుట్లూరు మండలంలో టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలను అరికట్టాలని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ సమన్తయకర్త సాకే శైలజానాథ్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన పుట్లూరు పార్టీ కార్యాలయానికి చేరుకుని నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసులు తనను అడ్డుకోవడంపై ఆయన మండిపడ్డారు. తాను అభివృద్ధి పనులు చేపడుతున్న సమయంలోనూ కొందరు అడ్డంకులు సృష్టించారని, అయినా తాను అభివృద్ధి చేసి చూపించానని తెలిపారు. ఓటమి భయంతోనే తమను అడ్డుకుంటున్నారని గుర్తు చేశారు. తానేంటో నియోజకవర్గ ప్రజలకు తెలుసని, ఎవరైనా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తే వారికే నష్టం కలుగుతుందని హెచ్చరించారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు శ్యాంసుందర్‌రెడ్డి, అంజి, హరినాథ్ పాల్గొన్నారు.


