Ananthapur: టవర్‌క్లాక్‌ బ్రిడ్జిపై రాకపోకలు షురూ | Sakshi
Sakshi News home page

Ananthapur: టవర్‌క్లాక్‌ బ్రిడ్జిపై రాకపోకలు షురూ

Published Tue, May 30 2023 8:24 AM

- - Sakshi

అనంతపురం క్రైం: జిల్లా కేంద్రం అనంతపురానికి మణిహారమైన టవర్‌క్లాక్‌ బ్రిడ్జిపై సోమవారం రాకపోకలు మొదలయ్యాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో వేలాదిమందితో నిర్వహించిన బైక్‌ ర్యాలీతో బ్రిడ్జిపై రాకపోకలు ప్రారంభమయ్యాయి.

బళ్లారి బైపాస్‌లోని ఎంజీ పెట్రోల్‌ బంక్‌ నుంచి బ్రిడ్జి మీదుగా టవర్‌క్లాక్‌, సప్తగిరి సర్కిల్‌, ఐరన్‌బ్రిడ్జ్‌, గాంధీ బజార్‌, శ్రీకంఠం సర్కిల్‌, రైల్వే ఫీడర్‌ రోడ్డు, ఆర్ట్స్‌ కళాశాల వరకు ఉల్లాసంగా.. ఉత్సాహంగా ర్యాలీ సాగింది. ఎమ్మెల్యే ‘అనంత’ పార్టీ జెండా పట్టుకుని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. ఆర్ట్స్‌ కళాశాల వద్ద ఎమ్మెల్యే అనంతను పార్టీ కార్యకర్తలు భుజాలపైకి ఎత్తుకుని ఊరేగించారు. జై జగన్‌.. జై అనంత అంటూ నినదించారు. నూతన బ్రిడ్జిని తిలకించేందుకు వేలాదిమంది ప్రజలు తరలిరావడంతో టవర్‌క్లాక్‌ – పీటీసీ వరకు పండుగ వాతావరణం కనిపించింది.

‘అనంత’లో రూ.650 కోట్ల అభివృద్ధి
కోవిడ్‌తో ఏడాదిన్నర కాలం గడిచిపోయినా...మిగతా రెండున్నరేళ్లలో అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో రూ.650 కోట్లతో రోడ్లు, డ్రెయినేజీలు తదితర అభివృద్ధి పనులు చేశామని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. టీడీపీ హయాంలో ఆర్‌అండ్‌బీ పరిధిలోకి తీసుకొచ్చిన ఫ్లై ఓవర్‌ను ఎన్‌హెచ్‌ పరిధిలోకి తీసుకొచ్చి అభివృద్ధి చేసి.. ట్రాఫిక్‌ కష్టాలు తీర్చాలని ఎంపీ తలారి రంగయ్యతో కలిసి సీఎం దృష్టికి తీసుకుపోయామన్నారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించి అర్బన్‌ లింక్‌ ప్రాజెక్ట్‌ కింద రోడ్ల విస్తరణతో పాటు టవర్‌క్లాక్‌ బ్రిడ్జిని కూల్చి.. దాని స్థానంలో కొత్తగా నాలుగు వరసలతో బ్రిడ్జి నిర్మించేందుకు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించారన్నారు.

ప్రస్తుతం సప్తగిరి సర్కిల్‌, శాంతి థియేటర్‌ వద్ద పనులు, బ్రిడ్జ్‌ కింద అండర్‌ పాస్‌ పనులను మరో మూడు నెలల్లో పూర్తి చేస్తామన్నారు.రూ.311.93 కోట్లతో నిర్మించిన టవర్‌క్లాక్‌ బ్రిడ్జ్‌, ఫోర్‌వేను సీఎం జగన్‌, కేంద్ర మంత్రులు త్వరలో అధికారికంగా ప్రారంభిస్తారన్నారు. అంతవరకు ఇలాగే ఉంటే ట్రాఫిక్‌తో ప్రజలు మరింత ఇబ్బంది పడతారని భావించి ముందస్తుగా బ్రిడ్జిపై రాకపోకలు మొదలయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. 16 నెలల్లోనే బ్రిడ్జ్‌ నిర్మాణం పూర్తి చేశారని, ఎస్‌ఆర్‌సీ, ఎన్‌హెచ్‌, ఆర్‌అండ్‌బీ, నగరపాలక, రెవెన్యూ, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు.

Advertisement
Advertisement