ఎండలో బండి నడుపుతున్నారా? జాగ్రత్త.. ప్రమాదం పొంచి ఉన్నట్టే | Be careful Bike riders, Its summer, Danger ahead | Sakshi
Sakshi News home page

ఎండలో బండి నడుపుతున్నారా? జాగ్రత్త.. ప్రమాదం పొంచి ఉన్నట్టే

Apr 21 2023 12:28 AM | Updated on Apr 21 2023 12:32 PM

- - Sakshi

రాత్రికి వంద రూపాయల పెట్రోల్‌ వేయించా... మాములుగా అయితే బండి రోజులు నడుస్తుంది. అలాంటిది ఒక్క రోజుకే పెట్రోల్‌ నిల్‌ అని చూపుతోందని సురేష్‌ ఆందోళన చెందాడు. ఈ సమస్య సురేష్‌ ఒక్కడిదే కాదు... జిల్లా వ్యాప్తంగా వాహనాలు వినియోగిస్తున్న అందరి అనుభవం. వేయించున్నా పెట్రోల్‌ ఏంమైంది? పెట్రోల్‌ బంకులోనే తక్కువగా వేస్తున్నారా? లేదా ఎవరైనా దొంగలిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇవేవి కాదని నిపుణులు చెబుతున్నారు. మండుతున్న ఎండల వేడికి వాహనాల్లోని పెట్రోల్‌ ఆవిరవుతుండడమే కారణంగా విశ్లేషిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి

హిందూపురం: అసలే వేసవికాలం... గతంలో ఎన్నడూ లేనంతగా సూరీడు భగభగ మంటూ నిప్పులు చెరుగుతున్నాడు. ఇలాంటి తరుణంలో వాహనాలను ఎక్కడబడితే అక్కడ ఎండలో ఉంచేస్తే పెట్రోల్‌ మొత్తం ఖాళీ అయిపోవడం ఖాయం. వాహనదారులు వేసవిలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని, లేకపోతే కొత్త సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..

ఈ ఏడాది వేసవి ఆరంభంలోనే జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఈ నెలాఖరు నుంచి మే మాసం లోపు 43.1 డిగ్రీల నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదని వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల మార్క్‌కు చేరుకోవడంతో ఎండ వేడిమికి జనం విలవిల్లాడుతున్నారు.

జాగ్రత్తలు తప్పనిసరి..

మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఉదయం 8 గంటలకే ఎండ వేడిమి ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఒకవేళ తప్పనిసరైతే ద్విచక్ర వాహనాలు లేదా, కార్లలో అలా వెళ్లి ఇలా వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో వాహనాలను ఎండలో ఎక్కడబడితే అక్కడే ఆపేస్తున్నారు. దీంతో ఎండ వేడిమికి ఆయా వాహనాల్లోని ఇంధనం ఆవిరైపోతోంది. ఇది ఒక్కోసారి అగ్నిప్రమాదాలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పార్కింగ్‌ జోన్లు లేక అవస్థలు..

జిల్లాలోని హిందూపురం, పుట్టపర్తి, కదిరి మున్సిపాల్టీలతో పాటు పంచాయతీ కేంద్రాల్లో పార్కింగ్‌ జోన్లు లేక వాహదారులు అవస్థలు పడుతున్నారు. కాయగూరలకు ఇతర అవసరాలకు వాహనాల్లో వెళ్లినప్పుడు ఎండలోనే పార్కింగ్‌ చేయాల్సి వస్తోంది. ఫలితంగా ఇంధనం ఆవిరై పోతుండడంతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల 2,77,235 వాహనాలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

అలాగే వివిధ ప్రాంతాల్లోని 139 పెట్రోలు బంకుల్లో గతంలో రోజు వారీ 139 వేల లీటర్ల పెట్రోలు, డీజిల్‌ విక్రయాలు సాగేవి. వేసవి ఆరంభం నుంచి ఇది పెరుగుతూ వస్తోంది. తాజాగా 210 వేల లీటర్ల మార్క్‌ను చేరుకుంది.వేసవిలో వాహనదారులు అప్రమత్తంగా లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఎండ వేడిమికి పెట్రోల్‌ ట్యాంకుల్లో గ్యాస్‌ ఏర్పడి పేలిపోయే ప్రమాదముంది. రాత్రి పూట బైక్‌ను నిలిపి ఉంచినప్డుపు ఓ సారి ట్యాంక్‌ మూత తీసి మళ్లీ మూసి వేయాలి. మందపాటి సీటు కవర్లు వాడడం మంచిది. పెట్రోల్‌ ట్యాంకులను సైతం కప్పి ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలను నీడలోనే పార్కింగ్‌ చేయడం ఉత్తమం.

– షాజహాన్‌, మెకానిక్‌, హిందూపురం

హిందూపురంలోని ప్రధాన రహదారి పక్కనే ఎండలో పార్క్‌ చేసిన వాహనాలు 1
1/2

హిందూపురంలోని ప్రధాన రహదారి పక్కనే ఎండలో పార్క్‌ చేసిన వాహనాలు

2
2/2

Advertisement
 
Advertisement
Advertisement