చోడవరం పంచాయతీ కౌంటింగ్‌లో అర్ధరాత్రి హైడ్రామా
తొలుత వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థి 36 ఓట్ల ఆధిక్యంతో గెలిచినట్లు ప్రకటన
ఆపై ఎమ్మెల్యే రాజు ఒత్తిడితో ఫలితం తారుమారు
రీకౌంటింగ్ కోరుతూ తెల్లవారుజాము వరకు వైఎస్సార్‌సీపీ ఆందోళన
ఓట్ల లెక్కింపులో
చోడవరం: చోడవరం మేజర్ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ఫలితం తీవ్ర వివాదానికి దారితీసింది. తొలుత వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థి 36 ఓట్ల ఆధిక్యంతో గెలిచినట్లు ప్రకటించి, ఆ తర్వాత అధికార టీడీపీ మద్దతు అభ్యర్థి 8 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ప్రకటించడంతో ఉత్కంఠ నెలకొంది. రీకౌంటింగ్ చేయాలన్న డిమాండ్‌ను అధికారులు పట్టించుకోలేదంటూ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల వరకు ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త గుడివాడ అమర్‌నాథ్ సైతం నిరసనలో పాల్గొనడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
తొలుత గెలుపు ప్రకటన..
ఆపై తారుమారు
కౌంటింగ్ పూర్తయిన వెంటనే వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థి గూనూరు రామచంద్రనాయుడు 36 ఓట్ల ఆధిక్యంతో గెలిచినట్లు అధికారులు తొలుత ప్రకటించారు. దీంతో ఆయన అనుచరులు ఆనందంతో కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో టీడీపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజుకు సమాచారం అందించడంతో ఆయన హుటాహుటిన కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల అధికారితో మాట్లాడిన కొద్దిసేపటికే ఫలితం మారిపోయి, టీడీపీ మద్దతు అభ్యర్థి గూనూరు వెంకట సత్యనారాయణ(పెదబాబు) 8 ఓట్ల మెజార్టీతో గెలిచినట్లు ఆర్వో ప్రకటించారు. దీంతో ఎలాంటి రీకౌంటింగ్ నిర్వహించకుండా ఫలితాన్ని ఎలా మారుస్తారని వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థి రామచంద్రనాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు.
రీకౌంటింగ్‌కు అనుమతించాలంటూ పట్టు
ఫలితంపై అభ్యంతరం తెలిపిన రామచంద్రనాయుడు రీకౌంటింగ్ నిర్వహించాలని కోరగా, దరఖాస్తు ఇవ్వాలని ఆర్వో సూచించారు. దీంతో ఆయన రాతపూర్వకంగా దరఖాస్తు సమర్పిస్తుండగా ఎమ్మెల్యేతోపాటు ఎంపీపీ మల్లునాయుడు, టీడీపీ నాయకులు అక్కడికి చేరుకుని రీకౌంటింగ్ ఎలా నిర్వహిస్తారంటూ అభ్యంతరం తెలుపుతూ ఫలితాలు వెంటనే ప్రకటించాలని ఆర్వోపై ఒత్తిడి తెచ్చారు. దీంతో వెంటనే టీడీపీ మద్దతు అభ్యర్థి 8 ఓట్ల మెజార్టీతో గెలిచినట్లు ఆయన ప్రకటించారు. కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులు డిక్లరేషన్ ఫారంపై సంతకాలు చేయకుండానే ఫలితాన్ని ఎలా ప్రకటిస్తారని రామచంద్రనాయుడు, ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే గూనూరు మిలట్రీనాయుడు ప్రశ్నించారు. పలుమార్లు రీకౌంటింగ్ కోరినా అధికారులు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్తూరు జంక్షన్ వద్ద బైఠాయింపు
కౌంటింగ్ కేంద్రం వద్ద ఇద్దరు డీఎస్పీలతో పాటు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను పోలీసులు బయటకు పంపించడంతో వారంతా కొత్తూరు జంక్షన్ వద్ద బైఠాయించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 4.30 గంటల వరకు రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగించారు. సమాచారం అందుకున్న అమర్‌నాథ్, నియోజకవర్గ పరిశీలకుడు గండి రవికుమార్ అక్కడికి చేరుకుని నిరసనలో పాల్గొన్నారు.
రామచంద్రనాయుడుకు 85 ఓట్ల ఆధిక్యం : అమర్‌నాథ్
పోలీసుల అనుమతితో కౌంటింగ్ అధికారిని కలిసిన అమర్‌నాథ్ టేబుల్ వారీగా పోలైన ఓట్ల వివరాల పట్టికను ఇవ్వాలని కోరారు. తొలుత ఆ వివరాలు లేవని, ఆ తర్వాత ఉన్నాయని ఆర్వో పొంతనలేని సమాధానాలు ఇచ్చారని ఆయన ఆరోపించారు. అనంతరం చూపించిన వివరాలను పరిశీలించగా వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థి రామచంద్రనాయుడుకు 85 ఓట్ల ఆధిక్యం వస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయని అమర్‌నాథ్ పేర్కొన్నారు. ఆర్వో కూడికలు, తీసివేతలు వేసిన తర్వాత తొలుత ప్రకటించినట్లుగా 36 ఓట్ల ఆధిక్యంతోనైనా రామచంద్రనాయుడిని విజేతగా ప్రకటించాల్సి ఉందన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లతోనే టీడీపీ మద్దతు అభ్యర్థికి 8 ఓట్ల మెజార్టీ వచ్చినట్లు ప్రకటించారని ఆరోపించారు. ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘన అని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.


