కశింకోట: మండలంలోని అమీన్‌సాహెబ్‌పేట (ఏఎస్ పేట) పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు సత్తాచాటారు. సర్పంచ్‌తో పాటు పది వార్డులనూ కై వసం చేసుకున్నారు. సర్పంచ్‌గా మలసాల వెంకటలక్ష్మి ప్రమోదిని(సిరి) 687 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. మండలంలో అత్యధిక మెజార్టీ సాధించిన అభ్యర్థిగా నిలిచారు. బీటెక్ కంప్యూటర్ ఇంజినీరింగ్ చదివిన ఆమె గృహిణిగా ఉంటున్నారు.
ఏడు దశాబ్దాలుగా
మలసాల కుటుంబానిదే ఆధిపత్యం
ఏఎస్ పేట పంచాయతీ 1958లో ఏర్పడినప్పటి నుంచి రెండు పర్యాయాలు మినహా మలసాల కుటుంబమే సర్పంచ్ పదవిని దక్కించుకుంటూ వస్తోంది. సుమారు ఏడు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన ఈ కుటుంబంలో తొలుత మలసాల అప్పారావు దాదాపు మూడు దశాబ్దాలపాటు సర్పంచ్‌గా వ్యవహరించారు. అనంతరం ఆయన కుమారుడు, విశాఖ డెయిరీ మాజీ డైరెక్టర్ మలసాల రమణారావు 1988లో బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రెండు పర్యాయాలు ఆయన తల్లి సన్యాసమ్మ, గత ఎన్నికల్లో భార్య మలసాల కాసులమ్మ(ధనమ్మ) సర్పంచ్‌లుగా పనిచేశారు. తాజాగా మూడో తరంలో కోడలు వెంకటలక్ష్మి ప్రమోదిని సర్పంచ్‌గా ఎన్నికవడం విశేషం. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్‌కు ఈమె మరదలు కాగా, భర్త మలసాల కుమార్‌రాజా వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర నాయకుడిగా ఉన్నారు. అత్తమామల సూచనలు, పార్టీ నాయకులు, ప్రజల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రమోదిని తెలిపారు. ఆమె విజయంపై మలసాల భరత్‌కుమార్, అత్తమామలు, పార్టీ మండలాధ్యక్షుడు మలసాల కిషోర్, పార్టీ శ్రేణులు, అభిమానులు అభినందనలు తెలిపారు.


