పచ్చని కొండలు, దట్టమైన అటవీ ప్రాంతంతో అలరారే అనంతగిరి మండలం పినకోట కొండలు భారీ పేలుడుతో దద్దరిల్లాయి. శనివారం ఉదయం 8.30 గంటల సమయంలో పీచుమామిడి గ్రామ సమీపంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఏడుగురి ప్రాణాలను బలిగొంది. రోడ్డు నిర్మాణ పనులకు వినియోగిస్తున్న వాహనాల వ | - | Sakshi
Sakshi News home page

పచ్చని కొండలు, దట్టమైన అటవీ ప్రాంతంతో అలరారే అనంతగిరి మండలం పినకోట కొండలు భారీ పేలుడుతో దద్దరిల్లాయి. శనివారం ఉదయం 8.30 గంటల సమయంలో పీచుమామిడి గ్రామ సమీపంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఏడుగురి ప్రాణాలను బలిగొంది. రోడ్డు నిర్మాణ పనులకు వినియోగిస్తున్న వాహనాల వ

Oct 25 2026 1:11 AM | Updated on Oct 25 2026 1:11 AM

ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్న

క్లూస్‌ టీం సభ్యులు

సాక్షి, పాడేరు: అనంతగిరి మండలంలోని దాయత్తి రోడ్డులో బల్లగరువు–తునసీబు ప్రాంతాల మధ్య కొత్త రోడ్డు నిర్మాణ పనుల కోసం సామగ్రితో కూడిన క్యాంపర్‌ వ్యాన్‌ శనివారం ఉదయం అనకాపల్లి జిల్లా దేవరాపల్లి నుంచి బయలుదేరింది. వ్యాన్‌లో సుమారు 250 లీటర్ల డీజిల్‌, గ్యాస్‌ సిలిండర్‌, కొండరాళ్లను పేల్చేందుకు వినియోగించే జిలెటిన్‌ స్టిక్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. కడపకు చెందిన సూపరవైజర్‌ ఆదిబోయిన గురుప్రవీణ్‌(27), ఉపాధ్యాయురాలు జాగారపు సునీత(44), దేవరాపల్లికి చెందిన మణికంఠ(23), చీడికాడకు చెందిన నారాయణరావు, పెదబయలుకు చెందిన డ్రైవర్‌ పాంగి చిరంజీవి(30) వ్యాన్‌లో ప్రయాణిస్తున్నారు. పినకోట దాటిన తర్వాత పీచుమామిడి గ్రామ సమీపంలో రోడ్డు పనులకు వినియోగిస్తున్న మినీ టిప్పర్‌ ట్యాంకర్‌లో రోజూ మాదిరిగా డీజిల్‌ నింపుతుండగా మంటలు వ్యాపించినట్లు సమాచారం. దీంతో క్యాంపర్‌ వ్యాన్‌లోని పేలుడు సామగ్రి, గ్యాస్‌ సిలిండర్‌ పేలిపోయాయి. ఒక్కసారిగా సంభవించిన భారీ పేలుడుతో వ్యాన్‌లో ఉన్న ఐదుగురితోపాటు టిప్పర్‌ వద్ద ఉన్న అసోం, బిహార్‌కు చెందిన డ్రైవర్లు నసీరుద్దిన్‌, టింకు చంద్రవంశీ సింగ్‌ ప్రాణాలు కోల్పోయారు.

ఘటనా స్థలానికి క్లూస్‌ టీంలు

సమాచారం అందుకున్న అనకాపల్లి, అల్లూరి జిల్లాల ఎస్పీలు తుహిన్‌ సిన్హా, అమిత్‌ బర్ధర్‌ సహాయక చర్యలకు పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పోలీసులు, క్లూస్‌ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాయి. ఐదుగురి మృతదేహాలను గుర్తించగా, నసీరుద్దిన్‌, టింకు మృతదేహాల కోసం గాలింపు చేపట్టారు. పేలుడుకు దారితీసిన పరిస్థితులు, వాహనాల్లో తరలిస్తున్న సామగ్రి వివరాలపై అధికారులు విచారణ చేస్తున్నారు.

ఉపాధ్యాయురాలి మృతితో విషాదం

ఈ ప్రమాదంలో మహిళా ఉపాధ్యాయురాలు జాగారపు సునీత(44) మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. శనివారం ఉదయం క్యాంపర్‌ వ్యాన్‌లో ప్రయాణిస్తుండగా జరిగిన పేలుడులో ఆమె ప్రాణాలు కోల్పోయారు. సునీత మృతితో కుటుంబ సభ్యులు, సహచర ఉపాధ్యాయులు, స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. అనంతగిరి ఎంఈవో బాలాజీతోపాటు పలువురు ఉపాధ్యాయులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

తనిఖీలు ఎక్కడ?

సాక్షి, పాడేరు: ఏజెన్సీ ప్రాంతంలో రోడ్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల కోసం కొండలు, బండరాళ్లను పేల్చే చర్యలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఇందుకోసం జిలెటిన్‌ స్టిక్స్‌, ఇతర పేలుడు సామగ్రిని తరలిస్తున్నా.. భద్రతా నిబంధనల అమలుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేలుడు సామగ్రి రవాణాకు సంబంధిత అనుమతులు తీసుకోవడంతో పాటు నిబంధనల ప్రకారం భద్రతా చర్యలు పాటించాల్సి ఉంటుంది. అయినప్పటికీ, ఇటీవల కాలంలో ఏజెన్సీ ప్రాంతానికి పేలుడు సామగ్రి తరలింపు పెరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్మాణ సంస్థలు, కాంట్రాక్టర్లు పేలుడు సామగ్రి రవాణాలో కనీస భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నారా? అనుమతులు లేకుండా తరలిస్తుంటే అధికారులు ఎందుకు అడ్డుకోవడం లేదు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రోడ్ల నిర్మాణానికి అడ్డుగా ఉన్న కొండలు, బండరాళ్లను తొలగించేందుకు భారీగా పేలుడు సామగ్రిని వినియోగిస్తున్నారు. అనంతగిరి మండలం పీచుమామిడి వద్ద పేలిన జిలెటిన్‌ స్టిక్స్‌ కూడా రోడ్డు నిర్మాణ పనుల కోసమే తీసుకువెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే, వాటి రవాణాకు అవసరమైన అనుమతులు ఉన్నాయా? భద్రతా నిబంధనలు పాటించారా? అన్నది స్పష్టత రావాల్సి ఉంది. దేవరాపల్లి ప్రాంతంలో ఉదయం వేళల్లో వాహనాల తనిఖీలు పటిష్టంగా నిర్వహించడం లేదని, దీంతో నిర్మాణ పనులకు సంబంధించిన సిబ్బంది పేలుడు సామగ్రిని యథేచ్ఛగా తరలిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రవాణా సమయంలో భద్రతా చర్యలు సరిగా తీసుకోకపోవడం వల్లే ఏడుగురు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పేలుడు సామగ్రి రవాణాకు అనుమతులు, భద్రతా ప్రమాణాలు, పోలీసుల తనిఖీలపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది.

పినకోటలో భారీ పేలుడు

వ్యాన్‌లో పేలుడు పదార్థాల రవాణా

డీజిల్‌ నింపుతుండగా మంటలు

దగ్ధమైన వాహనాలు.. ఏడుగురు మృతి

చెల్లాచెదురైన మృతదేహాలు

మృతుల్లో ఉపాధ్యాయురాలు సునీత

చీడికాడ : అరకు దరి పినకోట ప్రమాదంలో దుర్మరణం చెందిన మండలంలోని శిరిజాం శివారు ఎస్‌.ఎన్‌.పురం కాలనీలో మృతుడు మండల నారాయణమూర్తి ఇంటి వద్ద విషాధ ఛాయలు అలుముకున్నాయి. నారాయణమూర్తి గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ బియ్యం అందించే వాహనం నడిపేవాడు. ప్రభుత్వం మారి పోవడంతో ఆ వాహనాలను నిలిపి వేశారు. దీంతో ఉపాధి కోసం రోడ్డు కాంట్రాక్టు పనుల్లో చేరారు. ఆయనకు హృద్రోగంతో బాధపడుతున్న తల్లి కనమ్మ, భార్య కనకమహాలక్ష్మి, 9వ తరగతి చదువుతున్న కుమారుడు రోహిత్‌, 7వ తరగతి చదువుతున్న కనకలక్ష్మి అనే కుమార్తె ఉన్నారు. వీరి చదువుల కోసం చోడవరంలో నివాసం ఉంటూ నారాయణ మూర్తి కాంట్రాక్టు పనుల్లో చేరారు. ఈ ప్రమాదంలో నారాయణమూర్తి మృతి చెందడంతో కుటుంబ పోషణ చేసే ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో గ్రామంలో విషాధ ఛాయ లు అలముకున్నాయి. నారాయణమూర్తి మృతి వార్తను దాచి నారాయణమూర్తి గాయపడి చికిత్స పొందుతున్నాడని గ్రామస్తులు తల్లి, భార్య పిల్లలకు చెప్పి ఓదార్చుతున్నారు. అందరి మంచికోరే నారాయణమూర్తి మృతి విషయం తెలియడంతో పంచాయతీలో గల నాలుగు గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement