నామినేషన్ల పరిశీలనలోనూ ‘కూటమి’ ఒత్తిళ్లు | - | Sakshi
Sakshi News home page

నామినేషన్ల పరిశీలనలోనూ ‘కూటమి’ ఒత్తిళ్లు

Oct 25 2026 1:11 AM | Updated on Oct 25 2026 1:11 AM

కులధ్రువీకరణ పత్రంపై అభ్యంతరమెందుకు?

మునగపాక అధికారులపై వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆగ్రహం

చీడికాడలో వివరాలు సరిగ్గా లేవని 2 నామినేషన్ల తిరస్కరణ

మళ్లీ తుపాను గండం

సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లాలో పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలుతో పాటు, శనివారం స్క్రూట్నీ ప్రక్రియ ముగిసింది.పలుచోట్ల అధికారుల కూటమి నేతలు ఒత్తిడి తీసుకొచ్చి నామినేషన్లు తిరస్కరించేందుకు ప్రయత్నించారు.పేరులో తప్పుందని,రెండు నామినేషన్లకు ప్రతిపాదకులు ఒక్కరే అవ్వడంతో రెండు నామినేషన్లను,కుల ధ్రువీకరణ పత్రాల విషయంలో మరొక నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. దీంతో ఆర్డీవోను ఆశ్రయించాలని అభ్యర్థులు సన్నద్ధం అవుతున్నారు.

భారీగా నామినేషన్లు...

అనకాపల్లి జిల్లా పరిధిలోని 24 మండలాల్లో 24 జెడ్పీ స్థానాల కోసం 290 మంది నామినేషన్లు దాఖలు చేయగా, 427 ఎంపీటీసీ స్థానాలకు 2,726 నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం.పోటీలో వైఎస్సార్‌ సీపీతో పాటు, టీడీపీ, జనసేన, బీజేపీ,ఆప్‌, బీఎస్పీ, సీపీఐ(ఎం), ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు.

జెడ్పీ కోసం కూటమిలో కల్లోలం...

అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న జిల్లా జెడ్పీ పీఠం కోసం కూటమిలో కల్లోలం మొదలయ్యింది. 24 జెడ్పీ స్థానాల కోసం 178 దాఖలు చేయడం గమనార్హం. నామినేషన్ల చివరి రోజు వరకూ జెడ్పీ పీఠం కోసం పోటీలో లేని జనసేన అనూహ్యంగా చివరి రోజు దూకుడు ప్రదర్శించింది. 24 జెడ్పీటీసీలకు గానూ ఒక్క జనసేన నుంచే 57 మంది నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. జెడ్పీ పీఠం కోసం ఏకంగా యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ వదిన దమయంతి చేత నామినేషన్‌ వేయించారు. యలమంచిలి, రాంబిల్లి మండలాల్లో నామినేషన్లు వేసిన ఈమెకు జెడ్పీ పీఠం కోసం పట్టుపడుతున్నారు. ఈ పరిణామాలతో ఆ నియోజక వర్గంలో టీడీపీ ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడింది. తమకు సీటు ఖరారు అనుకున్న టీడీపీ అభ్యర్థి ఎంచుకున్న మండలంలో జనసేన నుంచి 7 నామినేషన్లు వేయించడం అది కూడా చివరి రోజు పిలిపించుకొని నామినేషన్లు వేయించడంతో టీడీపీ నేతలు మదనపడిపోతున్నారు. రాష్ట్రంలో 7 జెడ్పీ పీఠాలను ఆశిస్తున్న జనసేన అధినేత కోరిన జాబితాలో అనకాపల్లి ఉందని ఇక్కడి జనసేన నేతలు హడావిడి మొదలుపెట్టారు. మరోవైపు తనకెలాగైనా జెడ్పీపీఠం ఇవ్వాలని జిల్లా టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు పట్టుబడుతున్నారు. బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన మండలాల్లో టీడీపీ, జనసేన నుంచి నామినేషన్లు పడడంతో తమకు సీటు వస్తుందో రాదోనన్న బెంగతో కమలదళం పార్టీ అధినాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. మరోవైపు కశింకోట మండలం బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు కూడా తన సతీమణితో నామినేషన్‌ వేయించారు. టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న తమ కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్‌ మాజీ జెడ్పీ చైర్మన్‌ లాలం కుటుంబం జనసేనపై చిర్రుబుర్రులాడుతున్నారు.

అచ్యుతాపురం జెడ్పీటీసీ నామినేషన్‌ బుచ్చెయ్యపేటలో..

అధికారుల తప్పిదంతో గందరగోళం

బుచ్చెయ్యపేట: అధికారుల నిర్లక్ష్య ధోరణితో అచ్యుతాపురం జెడ్పీటీసీ నామినేషన్‌ బుచ్చెయ్యపేట జెడ్పీటీసీ అభ్యర్థిగా నమోదు కావడంతో గందరగోళం నెలకొంది. వైఎస్సార్‌సీపీ నుంచి అచ్యుతాపురం జెడ్పీటీసీ అభ్యర్థిగా నర్మల సుహాసిని రెండు సెట్లు నామినేషన్లు వేశారు. అనకాపల్లి జెడ్పీ కార్యాలయంలో అక్కడ అధికారులు సుహాసినికి సంబంధించిన రెండు సెట్లలో గంగిరెడ్డి రాము ప్రతిపాదించిన ఒక నామినేషన్‌ను అచ్యుతాపురం మండలంలోను, కేవీఈ సత్యనారాయణ ప్రతిపాదించిన మరోక నామినేషన్‌ను బుచ్చెయ్యపేట మండలం జెడ్పీటీసీ పోటీ జాబితాలో తప్పుగా నమోదు చేశారు. దీంతో బుచ్చెయ్యపేట మండలంలో ఈ పేరున ఎవ్వరూ లేకపోవడంతో విస్తుపోయారు.

స్క్రూట్నీలోనూ ‘పచ్చ’పాతం

నామినేషన్లను తిరస్కరించేందుకు కొన్ని చోట్ల అధికారులు ప్రయత్నించడంతో ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. మునగపాక మండలంలోని నాగవరం అభ్యర్థికి సంబంధించిన కులధ్రువీకరణ పత్రాల విషయంలో కూటమి నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సంబంధిత పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌తో ప్రభుత్వ మాజీ విప్‌ కరణం ధర్మశ్రీ మునగపాక తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకొని నిలదీశారు. కాగా ఇదే తరహాలోనే బుచ్చెయ్యపేటలో నామినేషన్‌ దాఖలు చేసిన జిల్లా టీడీపీ అధ్యక్షుని కుటుంబీకుల విషయంలో ఒకలా, మునగపాకలో ఒకలా వ్యవహరించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. చీడికాడలో రెండు నామినేషన్లు తిరస్కరించగా, చాలా చోట్ల రెండేసి, మూడేసి నామినేషన్లు వేసిన అభ్యర్థుల విషయంలో ఒక నామినేషన్‌నే పరిగణించి మిగిలిన వాటిని తిరస్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement